మిథున్‌కు ఏం కావాలంటే అది.. కోర్టు ఆదేశం!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆ పార్టీ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి.. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మాస్ట‌ర్ మైండ్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని సిట్ అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నారు. మ‌ద్యం కంపెనీల నుంచి ఎంతెంత ముడుపులు తీసుకోవాలి? వాటిని ఎక్క‌డ దాచాలి..? ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి పంపించాలి? ఎవ‌రికి చేర్చాల‌న్న విష‌యంపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేసింది కూడా మిథున్ రెడ్డేన‌ని.. చార్జిషీట్‌లో సిట్ అధికారులు వివ‌రించారు.

అనంత‌రం.. ఆయ‌న‌ను ప‌లు మార్లు విచార‌ణ‌కు పిలిచారు. దీంతో అరెస్టు భ‌యంతో కోర్టుల‌ను ఆశ్ర‌యించినా.. ప్ర‌యోజ‌నం ద‌క్క లేదు. దీంతో శ‌నివారం.. మిథున్‌ను సిట్ అధికారులు అరెస్టు చేయ‌డం.. ఆదివారం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 1 వ తేదీ వ‌ర‌కు రిమాండ్ విధిస్తూ.. విజ‌య‌వాడ‌లోని ఏసీబీకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు మిథున్ రెడ్డిని త‌ర‌లించారు. అయితే.. ఈ క్ర‌మంలోనే జైలులో త‌న‌కు సుద‌పాయాలు క‌ల్పించాల‌ని.. తాను అనారోగ్యంతో ఉన్నాన‌ని కోర్టును కోరారు. మొత్తంగా మూడు పిటిష‌న్ల‌ల‌ను దాఖ‌లు చేశారు.

వీటిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. మిథున్ రెడ్డికి అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో… టీవీ, మెత్త‌టి ప‌రుపు, వెస్ట్రన్ కమోడ్ ఉండే టాయిలెట్‌, మూడు పూట్ల బయట నుంచి భోజనం, చిరుతిళ్లు, టిఫిన్లు, టీ , కాఫీ, పాలు వంటివి ఏర్పాటు చేయాల‌ని పేర్కొంది. అలాగే.. దోమ తెర, యోగా చేసుకునేందుకు వీలుగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు..కూడా ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక స‌హాయ‌కుడిని అందుబాటులో ఉంచాల‌ని పేర్కొంది. అలాగే, ఇద్దరు లాయర్లు తో ఏకాంతంగా వారానికి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వ‌హించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్నులు సమకూర్చాలని జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ పాస్ చేసింది.