వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి తీర్పు వెలువరించారు. దీంతో మిథున్ రెడ్డిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే.. దీనికి ముందు సుమారు 4 గంటలకు పైగానే హైడ్రామా నడిచిం ది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. మిథున్ రెడ్డికోర్టుకు తెలిపారు. అయితే.. అదంతా ఉత్తిదేనని.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని దర్యాప్తు బృందం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలా.. ఇరు పక్షాలు కూడా గంటల కొద్దీ వాదనలు వినిపించడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డికి రక్తం గడ్డకట్టే వ్యాధి(బ్లడ్ క్లాట్స్) ఉన్న దృష్ట్యా.. ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోర్టును కోరారు. అంతేకాదు.. మిథున్ రెడ్డి ‘వై’ కేటగిరీ భద్రతలో ఉన్నారని.. ఆయన ప్యానల్ స్పీకర్‌గా కూడా పనిచేశారని చెప్పారు. ఒకవేళ రిమాండ్ విధించాల్సి వస్తే.. నెల్లూరు జైలుకు తరలించాలని.. తద్వారా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు. అయితే..కోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు సిట్ అధికారుల తరఫునన్యాయవాది కోటేశ్వరరావు వాదనలు వినిపించారు.
మిథున్ రెడ్డినిసంపూర్ణంగా విచారించలేదని, ఆయనను మరోసారి అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించాలని కోరారు. అయితే.. ఇరు పక్షాల వాదనలను కూడా.. కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సుదీర్ఘ వాదనల అనంతరం.. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇదిలావుంటే.. శనివారం రాత్రి విజయవాడ పోలీసు కమిషనర్ బంగళాలోని ప్రత్యేక గదిలో నే ఉన్న మిథున్ రెడ్డి.. ఆహారం తీసుకోలేదని.. చెప్పడంతో ఆయనకు ఆహారం అందించాలని అధికారులను ఆదేశించింది. ఇక, చార్జిషీట్ దాఖలైన తర్వాత.. అరెస్టు చేయడం ఎందుకన్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates