ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు మాస్టర్ మైండ్.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగనేనని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో మాణిక్కం ఎక్స్‌లో స్పందించారు. 3200 కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దోచుకున్నారని తెలిపారు. ఈ సొమ్మును ఎన్నికల్లో ఖర్చుచేసి.. ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు.
అయితే..మద్యం కేసులో ఇంతమంది అరెస్టు అవుతున్నా.. జగన్‌కు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అసలు మాస్టర్ మైండ్ జగనేనని.. మిథున్ రెడ్డి కేవలం ఆటలో అరిటి పండులాగా.. ఒక పావు మాత్రమేనని మాణిక్కం చెప్పారు. జగన్, ఆయన భార్య భారతిలు.. అక్రమంగా సంపాయించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారని.. తద్వారా దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని మాణిక్కం ఆరోపిం చారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సి అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా ఈ మద్యం కేసులో కేవలం డబ్బు మాత్రమే కాదని.. కోటి మంది ప్రజల కుటుంబాలతోనూ వైసీపీ నాయకులు ఆడుకున్నారని మాణిక్కం ఆరోపించారు. 30 వేల మందికిపైగా నకిలీ మద్యం తాగి మృతి చెందారని గతంలోనే తాము గణాంకాల సయితంగా వివరించామన్నారు. ఈ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేయించి.. దోషులను కఠినంగా శిక్షించాలని మాణిక్కం డిమాండ్ చేశారు. ముఖ్యంగా మాస్టర్ మైండ్ వంటి జగన్‌ను అసలు వదిలి పెట్టవద్దని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates