లిక్క‌ర్ స్కాంలో మిథున్ రెడ్డి రోల్ ఇదీ.. !

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో లిక్క‌ర్ ఆ పార్టీ నాయ‌కుల‌కు ఒక ఆదాయ వ‌న‌రు!. ఈ మాట చెప్పింది… ప్ర‌త్య‌ర్థులు కాదు.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు. అందుకే.. ఈ కేసులో ఇప్ప‌టికి 44 మందిని విచారించారు. వీరిలోనూ కీల‌క‌మైన మాజీ ఐఏఎస్ అదికారులు కూడా ఉన్నారు. అలానే.. వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారు. సో.. మొత్తంగా రాజ్ క‌సిరెడ్డితో మొద‌లైన ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు కీల‌క మ‌లుపు తిరిగింది.

ప్ర‌స్తుత ఎంపీ.. వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మిథున్ రెడ్డి వ‌ర‌కు వ‌చ్చింది. ఆయ‌న‌ను రేపో మాపో అరెస్టు చేయ‌డం ఖాయం. అయితే.. అస‌లు ఈ లిక్క‌ర్ కుంభ‌కోణంలో మిథున్ రెడ్డి ఏం చేశారు? అంత‌గా ఆయ‌నను ఈ కేసులో ఏ-4గా న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? అనేవి కీల‌క ప్ర‌శ్న‌లు. వీటిపైనా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు.. ప‌లు విష‌యాల‌ను వివ‌రించారు.

1) వైసీపీ హ‌యాంలో చీపు లిక్క‌రును అత్య‌ధిక మొత్తంలో అంటే.. రూ.50 విలువ చేసే బ్రాండ్ల‌ను రూ.200(క్వార్ట‌ర్‌)కు విక్ర‌యించేలా ధ‌ర నిర్ణ‌యించింది.. మిథున్ రెడ్డే.

2) త‌మ సొంత కంపెనీల‌ను ఏర్పాటు చేసి.. ఈ డిస్ట‌ల‌రీల ద్వారా మ‌ద్యాన్ని ప్ర‌భుత్వానికి విక్ర‌యించారు. ఈ క్ర‌మంలో సుమారు 15 కోట్ల‌ను తమ ఖాతాలోకి మ‌ళ్లించుకున్నారు.

3) సిట్ కేసు న‌మోదు చేయ‌డానికి ముందే.. ఏ కంపెనీల ద్వారా త‌మ‌కు సొమ్ము అందిందో .. ఆయా కంపెనీల‌కు ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. ఈ విష‌యాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించారు.

4) ఎంపీగా త‌న‌కు ఉన్న అధికారాల‌ను అడ్డం పెట్టుకుని.. జిల్లాల్లో.. అధికార యంత్రాంగాన్ని న‌డిపించారు. ఎక్సైజ్ పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లోనూ.. మిథున్ రెడ్డి పాత్ర ఉంది.

5) డిస్టిల‌రీలకు(ఇత‌ర కంపెనీలు) ఇండెంటు పెట్టే విష‌యం కూడా.. మిథున్ రెడ్డే చూసుకున్నారు. త‌ద్వారా.. త‌మ‌కు అధిక మొత్తంలో క‌మీష‌న్లు ఇచ్చే కంపెనీల‌కు ఎక్కువ మొత్తంలో ఇండెంటు ద‌క్కేలా చ‌క్రం తిప్పారు.

6) వ‌చ్చిన క‌మీష‌న్లు ఎవ‌రికి ఎంత మొత్తం చెల్లించాలో.. హైద‌రాబాద్‌, రాజంపేటలోని నివాసం, దుబాయ్‌ల‌లో చ‌ర్చించి నిర్ణ‌యించిన గ్రూపులో మిథున్ రెడ్డి ఒక‌రు. ఇలా.. ప‌లు అంశాల‌ను సిట్ అధికారులు పేర్కొన్నారు.