గతంలో తమ కుటుంబం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉండేదని.. అయితే.. ఇక్కడ తాగు నీరు కలుషితమని అందుకే.. తమ కుటుంబం ఆరు మాసాల కాలంలో అక్కడ నుంచి వేరే చోటకు తరలి పోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కనిగిరిలో ఫ్లోరైడ్ జలాలు వస్తున్నాయని .. దీంతో ఇక్కడి వారు అనారోగ్యం బారినపడుతున్నారని చెప్పారు. ఈ సమస్య తనకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు తాము కనిగిరిలోనే ఉండేవారమని చెప్పారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు నీటి సరఫరా చేసే పథకానికి శుక్రవారం శంకుస్థాపన చేసారు. 1,290 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకానికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
“ప్రకాశం జిల్లా వాసుల తాగునీటి కష్టాలు నాకు తెలుసు. నేను కూడా ఒంగోలు, కనిగిరి ప్రాంతాలలో ఉన్నా. మా చిన్నప్పుడు.. ఇక్కడే ఉండేవాళ్లం. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య వల్లే ఆరు నెలల్లోనే అక్కడి నుంచి మా కుటుంబం వెళ్లిపోయింది.” అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా గత వైసీపీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం జలజీవన్ మిషన్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. కనీసం ప్రజలకు స్వచ్ఛమైన నీటిని కూడా ఇవ్వలేదన్నారు.
నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యలేదని చెప్పిన పవన్ కల్యాణ్.. దానిని కూడా వైసీపీ నాయకులు పూర్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు వల్ల పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates