ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ విధ్వంసకర పాలనతో బెంబేలెత్తిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడుల వేట… మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుకు కొందరు టీడీపీ నేతలు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా తాజాగా ఆ జాబితాలో చేరారు.
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ మహేష్ యాదవ్ పట్టుబడిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మహేష్ ను ఆదేశించారు. అంతేకాదు, ఆ ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు ఆదేశించారు.
ఆ ఘటనపై నివేదిక ఇవ్వాలని పల్లాకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వ్యక్తులు, నేతలు చేస్తున్న తప్పులకు, వ్యక్తిగత వ్యవహారాలకు పార్టీ నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక రకంగా పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడుతుంటే… పుట్ట మహేష్ యాదవ్ వంటి నేతలు మరో రకంగా చంద్రబాబును ఇరకాటంలో పడేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ఇటువంటి నేతలను ఉపేక్షించకుండా తగిన చర్యలు చంద్రబాబు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే పార్టీకి తీరని నష్టం కలిగే ఛాన్స్ ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates