శంకర్ మెడకు ఇండియన్ ఉచ్చు

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ లేనంత అవమాన భారాన్ని మిగిల్చింది. శంకర్ కెరీర్లో బాయ్స్, ఐ లాంటి ఫెయిల్యూర్లు లేకపోలేదు. కానీ అవి ‘ఇండియన్-2’ అంత భరించలేని సినిమాలు కావు. ఆ సినిమా స్థాయిలో నష్టాలూ మిగల్చలేదు.

దర్శకుడిగా శంకర్ పతనాన్ని చూపించిన సినిమా అది. ఈ సినిమా దెబ్బకు లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ దాదాపుగా మూత పడే స్థితికి చేరుకుంది. రకరకాల కారణాల వల్ల సినిమా ఆలస్యమై చాలా నష్టపోయిన ఆ సంస్థ.. దీని బాక్సాఫీస్ ఫెయిల్యూర్ వల్ల ఇంకా దారుణంగా దెబ్బ తింది.

దీనికి తోడు ఇండియన్-3 పూర్తికాక, దానికి బజ్ లేక, రిలీజ్ కాక ఆ సంస్థ కోలుకోలేకపోయింది. ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండగానే ఈ సినిమాను పక్కన పెట్టేశారు. లైకా వాళ్లు సమయానికి డబ్బులు పెట్టకపోవడంతో శంకర్, కమల్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు.

అలా అని ‘ఇండియన్-3 మీద లైకా సంస్థ పూర్తిగా ఆశలు వదులుకుందా అంటే అదీ లేదు. శంకర్, కమల్ ఈ సినిమాను పూర్తి చేసేందుకు సంప్రదింపులు జరిపినా స్పందించలేదు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘వేల్పారి’ని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న శంకర్.. ఆలోపు ‘ఇండియన్-3’ సంగతి తేల్చాలని లైకాను సంప్రదిస్తే.. తాము ఇంతకుమించి సినిమాపై డబ్బులు పెట్టలేమని, మీరు-కమల్ కలిసి పూర్తి చేసుకోండి అని చెప్పేశారట. దీంతో శంకర్‌కు ఏం చేయాలో పాలుపోని స్థితి తలెత్తినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

ఇండియన్-3 సంగతి తేల్చకుండా వేరే ప్రాజెక్టు మీదికి వెళ్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని మరోవైపు బెదిరిస్తున్నారట. ఇదెక్కడి తలనొప్పి అని శంకర్ జుట్టు పీక్కుంటున్నట్లు తమిళ మీడియా రిపోర్ట్ చేస్తోంది.

ఐతే లీగల్ యాక్షన్ తీసుకున్నా సరే.. నిర్మాత డబ్బులు పెట్టనపుడు తానేం చేయగలనని శంకర్ అనే అవకాశముంది. కానీ వ్యవహారం కోర్టుకు చేరితే ఈ సినిమా ఆలస్యానికి, ఫెయిల్యూర్‌కు శంకర్‌ను బాధ్యుడిని చేస్తూ లైకా తన వెర్షన్ తాను వినిపించే అవకాశముంది. మరి ఇండియన్-3 కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.