కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా స్టార్ ఇమేజ్ ఉన్నపుడు ఒక ట్యాగ్ పెట్టుకుని.. రేంజ్ పెరిగాక అది ఆనలేదని ఇంకా పెద్ద ట్యాగ్ లైన్ పేరు ముందుకు తీసుకురావడమూ ఇండస్ట్రీలో కామనే.
కెరీర్ ఆరంభంలో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ తర్వాత ఐకాన్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబుకు సైతం మొదట్లో ‘ప్రిన్స్’ అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ పెద్ద స్టార్ అయ్యాక తండ్రి నుంచి వారసత్వంగా ‘సూపర్ స్టార్’ వచ్చేసింది. ఐతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్సులో ఈ ఇద్దరు హీరోలతో పాటు పలువురు స్టార్ల పేర్ల వెనుక పాత ట్యాగ్ లైన్‌లే ఉంచేశారు.
స్వయంగా బన్నీ.. తన పేరు ముందు ‘స్టైలిష్ స్టార్’ అని పెట్టుకున్నాడు. మహేష్ పేరు ముందూ ‘ప్రిన్స్’ అని ఉంచేశారు. ప్రభాస్‌ను ఇప్పుడు అందరూ అతడి పెదనాన్న కృష్ణంరాజు బిరుదైన ‘రెబల్ స్టార్’ అని పిలుస్తున్నారు. కానీ అల్లు సినిమాస్‌లో మాత్రం ‘డార్లింగ్’ అంటూ పాత ట్యాగ్ లైన్ వాడారు.
రామ్ చరణ్‌ను అభిమానులు మెగా పవర్ స్టార్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు సినిమాస్‌లో మాత్రం తన ముద్దు పేరు ‘చెర్రీ’ని వాడారు. కమల్ హాసన్‌కు లోకనాయకుడు/ఉలగనాయగన్ అని పేరుండగా.. పెద్దగా పాపులర్ కాని ‘కాలై జ్ఞాని’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరును కాకుండా ‘తారక్’ అనే షార్ట్ నేమ్‌తో సంబోధిస్తూ, తన పేరు వెనుక ‘టైగర్’ అని పెట్టారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ‘కింగ్ ఖాన్’ ట్యాగ్ లైన్ ఇవ్వడం విశేషం. షారుఖ్ ఖాన్‌ను ‘భాయిజాన్’ అన్నారు. సూపర్ స్టార్ బిరుదును రజినీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్‌కూ వాడారు. చిరును మెగాస్టార్ అని, పవన్ ను పవర్ స్టార్ అని, నాగ్‌ను కింగ్ అని, వెంకీకి విక్టరీ అని వాడి.. బాలకృష్ణ పేరు పక్కన ‘జై బాలయ్య’ అని నినాదాన్ని జోడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
