రాహుల్ డిమాండ్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం

మహారాష్ట్ర ఓటర్ల జాబితాను మెషీన్ రీడబుల్ డిజిటల్ ఫార్మాట్‌లో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కోరుతూ వస్తోంది. అయితే బుధవారం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని డిమాండ్‌పై ఈసీ గురువారం కుండబద్దలు కొట్టేలా స్పందించింది. ఇది చట్టబద్ధంగా సాధ్యపడదని స్పష్టం చేసింది. ఇతరులకు ఈ సమాచారాన్ని అందించేందుకు ప్రస్తుత చట్టం అనుమతించదని తేల్చేసింది. కాంగ్రెస్‌ డిమాండ్‌ను ఈసీ తిరస్కరించడంపై రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇటువంటి ఫార్మాట్‌లో ఇవ్వడం వల్ల డేటా మిస్‌యూజ్ అవే అవకాశముందని ఈసీ అంగీకరించడం లేదు.

ఇలాంటి డిమాండ్‌ను 2019లో సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన విషయాన్ని ఈసీ గుర్తు చేసింది. కమల్‌నాథ్ కేసులో సుప్రీం స్పష్టంగా చెప్పిందని, టెక్ట్స్ మోడ్‌లో మాత్రమే ఓటర్ల జాబితా లభ్యమవుతుందని తేల్చిందని పేర్కొంది. గత ఏడాదిన్నరగా రాహుల్ ఇదే డిమాండ్ చేస్తూ వస్తున్నారని, ఇది కొత్త విషయం కాదని ఈసీ అధికారులు వ్యాఖ్యానించారు. ఏటా ఇదే డిమాండ్‌ను కాంగ్రెస్ కొద్దిపాటి మార్పులతో కొత్తగా ప్రస్తావిస్తూ వస్తోందని అన్నారు.

ఈ నేపథ్యంలో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీసిన వీడియో ఫుటేజీని కూడా కాంగ్రెస్ కోరినట్టు సమాచారం. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను ఈసీ వెంటనే ఖండించింది. తాజాగా ఓటర్ల జాబితాను మెషీన్ పఠించగలిగే ఫార్మాట్‌లో ఇవ్వాలని కోరడం సాధ్యపడదని, ఇప్పటికే సుప్రీం మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో తాము స్పష్టమైన నిబంధనల ప్రకారం పని చేస్తున్నామని ఈసీ పేర్కొంది.

కానీ రాహుల్ గాంధీకి ఈ విషయాలు ఎవ్వరూ వివరించకపోవచ్చని, అందుకే ఆయన ఈ డిమాండ్ చేస్తుంటారని ఈసీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఓటర్ల జాబితాలు టెక్ట్స్ మోడ్‌లో మాత్రమే ఇవ్వబడతాయని, సెర్చబుల్ PDF ఇవ్వాలన్న క్లాజ్ ఎక్కడా లేదని స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించాయి.

ఇక మరోవైపు, దేశంలో 345 గుర్తింపులేని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని పార్టీలు ఇవన్నీ. వీటి కార్యాలయాలు కూడా ఏవీ లేవని ఈసీ గుర్తించింది. దీంతో వీటిని అధికారికంగా పార్టీగా గుర్తించకుండా జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జారీ చేసిన జాబితాలో వివిధ రాష్ట్రాల పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2800కు పైగా గుర్తింపులేని పార్టీలున్నాయి. ఓ పార్టీ గుర్తింపు పొందాలంటే కనీస ఓట్ల శాతం లేదా సీట్లు రావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.