=

కూటమి సంబరాలు షురూ!

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించి బుధవారం(జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి పార్టీలు సంబరాలు ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. ఓ వైపు వెన్నుపోటు దినం అంటూ విపక్ష వైసీపీ నిరసనలకు తెర తీసినా… కూటమి పార్టీలు చేపట్టిన సంబరాల నేపథ్యంలో ఆ నిరసనలు దాదాపుగా కనిపించలేదనే చెప్పాలి. కూటమి సంబరాల్లో 3 పార్టీలకు చెందిన కీలక నేతలంతా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

ఇదిలా ఉంటే… కూటమి విజయాన్ని పురస్కరించుకుని టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. జూన్ 4 ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని ఆయన పేర్కొన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజని, సైకో పాలనకు అంతం పలికిన రోజని, ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కు నాందీ పలికిన రోజు అని, పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా జూన్ 4 గురించి ఇంటరెస్టింగ్ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. ప్రజా తీర్పునకు ఏడాది అంటూ మొదలుపెట్టిన పవన్…ప్రజా చైతన్యానికి కూడా ఏడాది అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఏడాది అని, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది అని, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ విజయానికి కూడా ఏడాది అంటూ ఆయన సెటైరిక్ కామెంట్లు చేశారు. భారత దేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు ఈ రోజు అన్న పవన్… ఐధేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ, ఫ్యూడలిష్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాందీ పలికిన రోజు అని ఆయన తెలిపారు. అటు కేంద్రం లోని నరేంంద్ర మోదీ సర్కారు విజయాలను గుర్తు చేస్తూనే…మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

జూన్ 4 విజయాన్ని గుర్తు చేసుకుంటూ టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టును పెట్టారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా జూన్ 4ను ఆయన అభివర్ణించారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారని… అరాచక, కక్షపూరిత పాలపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని ఆయన తెలిపారు. ఈ గెలుపు 5 కోట్ల ప్రజల గెలుపు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా తీర్పు తమ కూటమి బాధ్యతను మరింతగా పెంచిందని, చంద్రబాబు పాలనా అనుభవం, పవన్ కల్యాణ్ ఆశయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు పుష్కలంగా లబించడంతో ఏపీ పునర్నిర్మాణం ప్రారంభమైందిన ఆయన పేర్కొన్నారు.