వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. వచ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాదయాత్రకు రెడీ అవుతున్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఈవిషయంపై అనుకూల మీడియా జోరుగా కథనాలు రాస్తోంది. అయితే..ఈ పాదయాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. అసలు పాదయాత్ర ప్రారంభిస్తే.. జగన్ కు కొన్నిప్రశ్నలు ఎదురు కాకతప్పదు. పాదయాత్ర అనేది నాయకులు చేయడం తప్పుకాదు. ఆమాటకు వస్తే.. నర్మదా బచావో ఆందోళన్ సమయంలో అనేక మంది పాదయాత్ర చేశారు.
అయితే.. ఏ పాదయాత్రకైనా అర్ధం ఉండాలి. ఆ తర్వాతే పరమార్థం చేకూరుతుంది. ఏదైనా ఒక సారి చేస్తే ముద్దు.. కానీ.. పదే పదే చేస్తే..? అదే ఇప్పుడు జగన్‌కు ముసురుకున్న ప్రశ్న. ఎందుకంటే 2019 ఎన్నికల కు ముందు జగన్ పాదయాత్ర చేశారు. అప్పుడంటే.. ఆయన అధికారంలోకి రాలేదు. పాలన ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదు. పైగా యువ రక్తం పొంగిపొర్లుతున్న నాయకుడు కావడంతో కొంత మురిపెం ఉంది. అదే ఆయనకు విజయాన్ని అందించింది.
కానీ.. ఐదేళ్లు పాలన చేసిన తర్వాత.. మళ్లీ తగుదునమ్మా అంటూ పాదయాత్రకు వస్తే.. ప్రజలు ఏ రకంగా అర్ధం చేసుకుంటారు? అనేది కీలక ప్రశ్న. అసలు సమస్యలే తెలియవు అన్న చోట సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం తప్పుకాదు. ఇది నారా లోకేష్‌కు కలిసి వచ్చింది. ఆయన తండ్రి, సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్రాన్నిపాలించినా.. నారా లోకేష్ కొత్త కాబట్టి.. ఆయన పాదయాత్రకు బాగానే జోష్ వచ్చింది. కానీ.. జగన్ విషయం అలా కాదు కదా!
ఐదేళ్లు పాలన సాగించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఆయన పాలనపై ప్రజలకు ఒక పిక్చర్ వచ్చేసింది. అందుకే 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రజల మధ్యకు వెళ్లినా.. అవేసమస్యలు. అవే ఇబ్బందులు. పైగా గత ఐదేళ్ల పాలనపై జగన్‌ను నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రజల మధ్యకురాకపోవడం.. వచ్చినా చెట్లు నరికించి, ఆంక్షలు పెట్టించిన విధానం వంటివి జనాలు మరిచిపోలేదు. ప్రత్యర్థులు గుర్తు చేయకుండా కూడా ఉండరు. సో.. ఎలా చూసుకున్నా.. పాదయాత్ర వల్ల జగన్‌కు వచ్చే ప్రయోజనం తక్కువేనన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ.