కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో కీలకమైంది.. ‘మోడీ వర్సెస్ బాబు’ వ్యవహారం. ఇది పూర్వం ఎప్పుడో 2015-19 మధ్య జరిగిన వ్యవహారాల గురించి కాదు. తాజాగా కూటమి కట్టిన తర్వాత..బీజేపీ-జనసే న-టీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. తెరమీదకు వచ్చిన ముచ్చటే. మోడీ వర్సెస్ బాబు.. అనేది అసలు చర్చ!
విషయం ఏంటంటే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. బీజేపీ అగ్రనాయకుడుగా.. ప్రధానిగా మోడీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. వికసిత భారత్ సృష్టికర్త, దేశానికి అందిన గొప్ప నాయకుడు.. అంటూ చంద్రబాబు మోడీని భుజాలపై.. ఆతర్వాత తలపై కూడా పెట్టుకున్నారు. కానీ, ఇదేసమయంలో మోడీ కూడా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయాలి కదా?.. మోడీ కంటే బాబు సీనియర్ కదా! అలా చేస్తారని టీడీపీ నాయకులు, అభిమానులు కూడా భావించారు.
కానీ.. మోడీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికల తర్వాత.. మూడు సార్లు వచ్చినా.. తొలి సార్లు మాత్రం కనీసం మెచ్చుకోలు మాటలైనా చంద్రబాబు గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కనీసం పన్నెత్తు పొగడ్త కూడా.. చంద్రబాబుకు దక్కలేదు. దీనిపై ఆ రెండు సార్లు(విశాఖలోనూ.. తర్వాత) మోడీ ఏంటి ఇలా చేశారు? చంద్రబాబు అలా పొగిడితే.. మోడీ కనీసం ఆయనను మెచ్చుకోలేదే? అని చర్చకు వచ్చింది. తమ్ముళ్లు అయితే అంతర్గతంగా మోడీ వైఖరిని తప్పుబట్టారు కూడా.
ఈ చర్చకు తాజాగా మోడీ ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాదు.. ‘బకాయి’ అంతా కలిపి ప్రభుత్వ ఉద్యోగికి ఒకే సారి చెల్లించినట్టుగా.. మోడీ ఒకేసారి చంద్రబాబును ఆకాశానికి.. ఎత్తేశారు. “ఒక రహస్యం చెబుతున్నా” అంటూ.. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సందర్భాన్ని గుర్తు చేసుకుని.. తాను చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.అంతే! ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ల గుండెలు నిండిపోయాయి. బాబు మనసు పులకించింది. ఎన్నోనాళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భం ఆవిష్కృతమైందంటూ.. నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. ప్రధాని కూడా ‘మోడీ వర్సెస్ బాబు’ అన్న చర్చకు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates