‘విశ్వ‌గురు’కు విష‌మ ప‌రీక్ష‌… అమెరికా-చైనా ఎటువైపు?

విశ్వ‌గురుగా…పేరు తెచ్చుకున్న‌ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి విష‌మ ప‌రీక్ష పెడుతోందా? ప్ర‌పంచ దేశాల‌కు శాంతి సందేశం అందిస్తున్న మోడీకి.. ఈ విష‌యం.. భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు మేధావులు. భార‌త దేశ ప‌రిధిలో ఉన్నంత వ‌ర‌కు .. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యాల‌నే తీసుకుంది. పాక్ పౌరుల‌ను దేశం నుంచి పొమ్మ‌న‌డం.. మ‌న వారిని ర‌ప్పించ‌డం.. దౌత్య కార్యాల‌యాల్లో సిబ్బందిని త‌గ్గించ‌డం.. స‌రిహ‌ద్దుల మూసి వేత వంటివి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర చ‌ర్య‌ల నేప‌థ్యంలో కీల‌క‌నిర్ణ‌యాల‌నే చెప్పాలి.

అయితే.. ఆప‌త్కాలంలో మోడీకి క‌లిసి వ‌చ్చే మిత్రులు ఎంత మంది? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఉగ్ర‌దాడిని నిర్మొహ‌మాటంగా ఖండిస్తున్న దేశాల‌కు కొద‌వ‌లేదు. అమెరికా, ర‌ష్యా, చైనా.. స‌హా అనేక దేశాలు.. మృతుల‌కు నివాళుల‌ర్పించాయి.. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఖండించాయి. ఇంత వ‌ర‌కు ఓకే. ఎవ‌రైనా చేసేదే. అయితే.. భ‌విష్య‌త్తు వ్యూహాల‌ను త‌లుచుకుంటే.. భార‌త్‌తో క‌లిసి వ‌స్తున్న‌,… వ‌చ్చే దేశాల సంఖ్య వేళ్ల‌పైనే లెక్కించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అప్ర‌క‌టిత మిత్ర‌త్వంతో పాకిస్థాన్‌ను మోస్తున్న చైనా.. అమెరికాలు.. రేపు భార‌త్ యుద్ధ స‌న్న‌ద్ధానికి సిద్ధ‌మైనా.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి వాటికి దిగినా.. పొరుగు దేశానికి సాయం అందించ‌కుండా ఉంటాయా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. జో బైడెన్ అధ్య‌క్షుడిగా ఉన్న‌స‌మ‌యంలో కంటే.. పాకిస్థాన్ విష‌యంలో ట్రంప్ వ్య‌వ‌హ‌రించే తీరు మ‌రింత డేంజ‌ర్‌గా ఉంటుందని గ‌త అనుభ‌వాలు మ‌న‌కు చెబుతున్నాయి. దీనికి కార‌ణం.. అమెరికా-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉన్న‌.. అనేక వ్యాపార, వాణిజ్య సంబంధాలే.

ఈ క్ర‌మంలో ఇప్పుడు భార‌త్ దూకుడు ప్ర‌ద‌ర్శించి.. యుద్ధానికే క‌నుక దిగితే.. అమెరికా త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంభించే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక‌ప్పుడు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌దాడుల‌ను భార‌త్-పాక్ వ్య‌క్తిగ‌త విష‌యాలుగా చెప్పిన‌.. అమెరికా.. ఈ విష‌యంలో త‌న పంథాను ఉన్న‌ట్టుండి మార్చుకుంటుంద‌న్న ఆశావాదం కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, కీల‌క దేశం చైనా.. ఇటీవ‌లే సుంకాల పోరు విష‌యంలో భార‌త్ త‌మ‌తో క‌లిసి రావాల‌ని అభ్య‌ర్థించింది.

దీనిపై భార‌త్ ఆలోచ‌న చేస్తున్న స‌మ‌యంలోనే పెహ‌ల్గామ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పైగా.. చైనా పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉన్న అనేక సంబంధాల‌ను ప‌రిశీలించినా.. డ్రాగ‌న్ దేశం.. భార‌త్‌తో చేతులు క‌లిపి.. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా నిలుస్తుంద‌న్న అంచ‌నాలు త‌క్కువ‌గానే ఉన్నాయి. ఇక‌, మ‌రో కీల‌క దేశం ర‌ష్యా. ఇది భార‌త్‌కు మిత్ర‌దేశ‌మే అయినా.. ఉక్రెయిన్ విషయంలో భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని ర‌ష్యా అధినేత పుతిన్ ఇప్ప‌టికీ ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌కు మిత్ర‌దేశంగానే ఆయ‌న భార‌త్ ను చూస్తున్నారు. కాబ‌ట్టి.. ఇప్పుడు భార‌త్‌కు ఏమేర‌కు ఆయ‌న సాయం చేస్తార‌న్న‌ది చూడాలి. కాగా.. జీ-20 స‌ద‌స్సుల‌తో ప్ర‌పంచ‌దేశాల‌కు శాంతి సందేశం, వసుధైక కుటుంబం అనే విష‌యాల‌పై భార‌త్ లెక్చర్లు ఇచ్చిన ద‌రిమిలా.. ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో విశ్వ‌గురు.. ప్ర‌ధాని మోడీకి ఏయే దేశాలు క‌లిసి వ‌స్తాయ‌న్న‌ది చూడాలి.