అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం 18 గంటల పాటు తిరుగుతూనే ఉంటాయి. పైగా.. ఈ ఏడాది గతంలో కన్నా ఎక్కువగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని అధికారులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం, నిరంతరాయ సరఫరా వంటివి ప్రభుత్వాలకు కత్తిమీద సాముగా మారాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెంచేసేందుకు కొన్ని ప్రభుత్వాలు.. ప్రయత్నాలు చేస్తున్నాయి. యూపీలో గత వారం యూనిట్‌కు 33 పైసలు చొప్పున పెంచారు. ఇక, దక్షిణాదిరాష్ట్రాల్లో కర్ణాటకలోనూ 20 పైసల చొప్పున పెంచారు. తెలంగాణలో దీనిపై ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే.. తాజాగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పై ఆయన కలెక్టర్ల సదస్సులో చర్చించారు.
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు కూడా విద్యుత్‌ను 24 గంటలూ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, వేసవి డిమాండ్ పెరిగినప్పటికీ.. విద్యుత్ చార్జీలను పెంచే ప్రసక్తేలేదని ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. “గత ప్రభుత్వం మాదిరిగా మనం చేయలేం” అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పటికే ట్రూ డౌన్ చార్జీలను తగ్గించామన్నారు.
వేసవి కాలం సుమారు మూడు మాసాలు ఉంటుందని.. ఈ కాలంలో కూడా చార్జీలను పెంచేది లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగిస్తూనే.. వచ్చే మూడు మాసాల్లో మరింతగా ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వినియోగం ఎంత ఉన్నా.. ధరలు పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని.. పరిశ్రమలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates