ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభణ నేపథ్యంలో యావత్తు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖానికి మాస్క లేకపోయినా, అనవసరంగా బయటకు వచ్చినా, నిత్యావసర సరుకుల కొనుగోలులో భౌతిక దూరం పాటించకపోయినా… కఠిన చర్యలేనంటూ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోడై కూస్తున్నాయి.
నిబంధన అమలులో కఠినంగానూ వ్యవహరిస్తామంటూ అధికార పార్టీలకు చెందిన నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే సాగర నగరం విశాఖలో ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేస్తున్న అవంతి శ్రీనివాస్… కరోనా వేళ పేదలకు సాయం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.
కరోనా వేళ… గ్రీన్ జోన్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. రెడ్ జోన్ కఠినాతికఠిన నియమాలు అమలవుతున్నాయి. రెడ్ జోన్ లో ఎలాంటి కార్యక్రమాలకు ఆస్కారమే లేదు. ఈ జోన్ లోని ప్రజలను బయటకు రానివ్వరు. బయటి వారిని అందలోకి ఎంట్రీ కానివ్వరు. అయితే మంత్రి హోదాలో ఉన్న అవంతి విశాఖలోని రెడ్ జోన్ ఏకంగా ‘సాయం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా హాజరయ్యాయి.
సాయం అందుకునేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. సరే… ఏదో ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తున్నారులే అనుకుంటే… రెడ్ జోన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అసలు భౌతిక దూరం అన్న మాటే కనిపించలేదు.
ఓ వైపు భౌతిక దూరం పాటించకుండా జనం సాయం కోసం ఎగబడితే… మరోపక్క కార్యక్రమ నిర్వహణ పేరిట మంత్రి అనుచరులు ముఖానికి మాస్కులు కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపించింది.
కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న మంత్రే ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తే… సదరు కార్యక్రమంలో లాక్ డౌన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కేశారన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారిపోయింది.