కూటమి ‘కర్ర పెత్తనం’ మంచిదేనన్న వెంకయ్య

ఇప్పుడంతా సోషల్ మీడియాదే పెత్తనం. మంచి చేయాలన్నా… చెడు చేయాలన్నా కూడా సోషల్ మీడియా నిమిషాల్లోనే చేసేస్తోంది. మంచి కంటే కూడా చెడు ఈ మీడియా ద్వారా వేగంగా విస్తరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను ఎలా పడితే అలా మార్చి చూపడం కూడా ఇట్టే సాధ్యమవుతోంది. ఇక రాజకీయాల్లో అయితే నేతల వ్యక్తిత్వ హననం సోషల్ మీడియా ద్వారా ఓ రేంజిలో సాగుతోంది. దీనిపై ఏపీలోని కూటమి సర్కారు… నిజంగానే కర్ర పెత్తనం చెలాయిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కనిపిస్తే… ఏపీ పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే చాలా అరెస్టులు జరగగా… ఇంకా చాలా అరెస్టులు తప్పవంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి సర్కారు కర్ర పెత్తనం ఎంతవరకు సబబు అంటూ న్యూట్రల్ జనాల్లో కొందరు.. దుర్మార్గం అంటూ విపక్ష వైసీపీ… దాని అనుబంధ మీడియాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అదే సమయంలో మరి సోషల్ మీడియాను కంట్రోల్ చేయకుంటే ఇంకెంత నష్టం జరుగుతుందో తెలుసా? అంటూ కూటమి వర్గాలు వాదించుకుంటున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కూడా లేదు.

ఈ క్రమంలో రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ కేంద్రంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పేరిట రాసిన పుస్తకావిష్కరణ సభకు వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వికృత క్రీడలను ప్రస్తావించిన వెంకయ్య… కూటమి సర్కారు కర్ర పెత్తనాన్ని సమర్ధించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా ఇప్పుడు విజృంభిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. తొలుత మంచికి మాత్రమే పరిమితమైన సోషల్ మీడియా ఆ తర్వాత చెడుకు కూడా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఇలాంటి సోషల్ మీడియాను కంట్రోల్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఏదో చేద్దామని భావిస్తే… అందరూ గగ్గోలు పెడుతున్నారనని ఆయన అన్నారు. మరి కంట్రోల్ లేకుంటే సోషల్ మీడియా ద్వారా ఎంతటి ముప్పు ఉంటుందో తెలుసా? అంటూ ప్రశ్నించిన వెంకయ్య… ఏపీలో చోటుచేసుకున్న ఉదంతాలే అందుకు నిదర్శనమని తెలిపారు. ఏపీలో సోషల్ మీడియాలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. దాని ఫలితంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఆసక్తికరమేనన్నారు.

సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడిన వారిలో కొందరు ఇప్పుడు ఆ పరిణామాలను చవిచూస్తున్నారని ఆయన అన్నారు. అదేమంటే ఎవరో చెబితే చేశానంటూ కొందరు చెబుతున్నారన్న వెంకయ్య… ఎవరో చెబితే ఏది పడితే అది చేయడానికి వారి బుద్ధి ఏమైందని కూడా ప్రశ్నించారు. మొత్తంగా సోషల్ మీడియాను అయినా ఇంకేదైనా కంట్రోల్ లోనే ఉండాలన్న వెంకయ్య… అది చెడుకు దారి తీస్తే దండించాల్సిన యంత్రాంగం కూడా అవసరమేనని తేల్చి చెప్పారు.