వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరేళ్లు కావస్తోంది. ఈ నెల 15వ తేదీకి వివేకా హత్యకు ఆరేళ్లు నిండనున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ కేసు దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు గానీ… ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగన్న బుధవారం చనిపోయాడు. వివేకా ఇంటి వద్ద రంగన్న వాచ్ మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 85 ఏళ్ల వయసున్న రంగన్న…నాడు వివేకా మరణించినప్పుడు అక్కడే ఉన్నారు. ఇంటి ప్రధాన గేటు వద్దే ఆయన నిద్రించారు. వివేకా ఇంటి వద్ద చాలాకాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వివేకా దైనందిన జీవనం గురించి ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని చెప్పాలి. వివేకా హత్య జరిగిన సమయంలో రంగన్న అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ కేసును విచారించిన పోలీసులు, సీబీఐ అదికారులు కూడా రంగన్న వాంగ్మూలాన్ని సేకరించారు. రంగన్న స్టేట్ మెంట్ ఈ కేసులో కీలకంగా పరిగణిస్తున్నారు. వయసురీత్యా అనారోగ్యంతో సతమతం అవుతున్న రంగన్న… బుధవారం తీవ్ర అస్వస్థతకు గురి కాగా…ఆయనను కడప రిమ్స్ కు తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
టీడీపీ అధికారంలో ఉండగా…2019 ఎన్నికలకు ఒక నెలముందు అదే ఏడాది మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లినా… ఎందుకనో గానీ వేగంగా దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ హత్య జరిగిన నెలల వ్యవధిలోనే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా కూడా ఈ కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇలాంటి క్రమంలో రంగన్న మృతి ఈ కేసు దర్యాప్తును మరింతగా ప్రభావం చూపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates