2029లోనూ టికెట్ కావాలంటే… ఏం చేయాలో చెప్పిన బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ఘట్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం శుక్రవారం పూర్తి అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు ప్రత్యేకించి కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ పై సమగ్ర అధ్యయనం చేయాలని… ఆయా పద్దులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని… ప్రభుత్వ కేటాయింపులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని.. బడ్జెట్ పై జరిగే ప్రసంగంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాలుపంచుకోవాలని… ఏదో సుదీర్ఘంగా మాట్లాడటం కాకుండా అతి తక్కువ సమయంలో బడ్జెట్ స్వరూపాన్ని ఆసక్తిగా అభివర్ణించేలా చేయాలని… ఇలా పలు సూచనలు చేశారు.

అనంతరం సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేయగా… టీడీపీ సభ్యులతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టీడీఎల్పీ భేటీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న చెప్పిన మాటలనే చంద్రబాబు కూడా మరోమారు చెప్పారు. బడ్జెట్ స్వరూపం… నిధుల లేమిలో కూడా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కేటాయింపులు జరిపిన తీరుపై ఒకింత లెంగ్తీగానే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు… ప్రత్యేకించి నూతన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2029లో మరోమారు పార్టీ టికెట్లు కావాలంటే.. పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో మమేకం అవడంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాలన్నారు. పార్టీలో విభేదాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంతిమంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజల్లో సద్భావన కలిగేలా చేయాలని ఆయన సూచించారు.

ఇవన్నీ చేస్తే… 2029 ఎన్నికల్లోనూ రెండో సారి కూడా టికెట్ దక్కుతుందని చంద్రబాబు కొత్త ఎమ్మెల్యేలకు చెప్పారు. అయితే ఇదేమంత ఈజీ అయిన విషయం కాదని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నిత్యం అవగాహన పెంపొందించుకుంటూ ఉండాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలన్నారు. అలా జరగాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఫలితంగా పార్టీపైనా, ప్రభుత్వ వ్యవహారాల మీద పట్టు వస్తుందన్నారు.

ఇవన్నీ చేసే ఏ నేత అయినా ఓటమిని ఎరుగకుండా ముందుకు సాగుతారని ఆయన చెప్పుకొచ్చారు . మొత్తంగా ప్రజా ప్రతినిధులుగా నిత్యం ప్రజలతోనే ఉండే నేతలకు తిరుగు లేదని… అలాంటి వారికి మరోమారు టికెట్ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.