ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే పోడియం దగ్గరకు దూసుకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆయనపై కాగితాలు విసిరేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనే గౌరవం లేకుండా వైసీపీ సభ్యులు చేసిన పనిపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పందించారు.
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతల ప్రవర్తనను పవన్ ఖండించారు. గొడవలకు, బూతులకు వైసీపీ నేతలు పర్యాయపదంగా మారిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేతలను ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారు అని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటన తర్వాత తనకు ఇలా అనిపించిందని, ఈ నేతలను ఇన్నాళ్లు ఎదుర్కొన్న చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఈ తరహా నేతలను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలని పవన్ అన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సందర్భంలో ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ తన ప్రసంగాన్ని గవర్నర్ విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. తమ తప్పు లేకపోయినప్పటికీ వైసీపీ నేతల తీరుకుగానూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నామని పవన్ అన్నారు. చట్టాలు చేయాల్సిన వైసీపీ శాసనసభ్యులు వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ నిలదీశారు.
నిన్న సభలో వైసీపీ సభ్యుల గొడవ చూసి వైసీపీ నేతల ఐదేళ్ల విధ్వంసకర పాలన గుర్తొచ్చిందని పవన్ చెప్పారు. ప్రజావేదిక కూల్చివేత, ఆలయాల కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, కల్తీ సారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిలపై లేఖ రాయడం, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడం, తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వైనం గుర్తొచ్చాయన్నారు.
అసెంబ్లీలో ఈ స్థాయిలో వారు ప్రవర్తిస్తే బయట కూడా ఇంతకన్నా ఎక్కువ గొడవలు సృష్టించి ఉంటారని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలు వారు వద్దు అని అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని పవన్ అన్నారు.