విశాఖలో విసారెడ్డి విరాళాల దందా: ఉమ

Devineni Uma
Devineni Uma

కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా విపత్తు సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు.

ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అయితే, విశాఖలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత బలవంతపు విరాళాల వసూళ్లకు పాల్పడుతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి.

విశాఖలోని పలువురు పారిశ్రామిక వేత్తలకు సదరు నేత, ఆయన అనుచరులు ఫోన్లు చేసి మరీ విరాళాలు ఇవ్వవలసిందేనని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫలానా సంవత్సరం ఇంత మొత్తం ఆదాయపు పన్ను కట్టారు కదా…అంటూ లెక్కలతో సహా చందాల దందా నడుస్తోందని కథనాలు వచ్చాయి. నెల రోజులుగా వ్యాపారాలు లేవని…ఇప్పటికే తోచినంత విరాళం ఇచ్చామని చెబుతున్నా….వేరే ఏదో ఒక పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

పేదలందరికీ సాయం చేసేందుకు రూ.15 కోట్లు అవసరమని, ఆ ‘టార్గెట్‌’ రీచ్ కావాలంటే విరాళాలివ్వాల్సిందేనని…ఆ తర్వాత విరాళాలకు పన్ను మినహాయింపులు వస్తాయని కూడా ఉచిత సలహా ఇస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ కీలక వైసీపీ నేత ఎవరా అని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కథనాలలోని నేత ఎవరన్న సస్పెన్స్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెరదించారు.

విశాఖలో విరాళాల పేరిట చందాల దందాకు పాల్పడుతున్నది వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటూ దేవినేని ఉమ పరోక్షంగా విమర్శించారు. విశాఖలో చందాల దందాలతో ట్రస్టులతో వ్యాపారవేత్తలని బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నది విసా రెడ్డి అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమ పరోక్షంగా ట్వీట్ చేశారు.

తన సహచరుడు విసా రెడ్డి మీద చర్యలు తీసుకునే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖని భాగస్వామ్య సదస్సులతో అంతర్జాతీయ పెట్టుబడులతో ప్రపంచపటం మీద గర్వంగా మాజీ సీఎం చంద్రబాబు గారు నిలబెట్టారని ఉమ అన్నారు. ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలిపరుగులు కనిపించడంలేదని, మూడుపూటలా పేదవాడి ఆకలితీర్చిన అన్నక్యాంటీన్ లు రద్దుచేసిందని ఉమ విమర్శించారు.

తాడేపల్లి రాజప్రసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారు పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అంటూ ఉమ ప్రశ్నించారు. మరి, ఉమ ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నది వేచి చూడాలి.