చంద్ర‌బాబు బెయిల్‌తో నీకేం సంబంధం: సుప్రీంకోర్టు

ఏపీ సీఎం చంద్ర‌బాబు బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. అస‌లు ఈ బెయిల్ పిటిష‌న్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అని ప్ర‌శ్నించింది. చంద్ర‌బాబు బెయిల్‌తో నీకేం సంబంధం అని పిటిష‌న‌ర్‌ను నిల‌దీసింది. ఇలా.. అవ‌స‌రం లేని విష‌యాల్లో జోక్యం చేసుకుని పిటిష‌న్ వేసినా.. కోర్టు స‌మ‌యాన్ని వృథా చేసినా.. భారీ చ‌ర్య‌లకు సిద్ధంగా ఉండాల ని కూడా పిటిష‌న‌ర్‌ను హెచ్చ‌రించింది. అనంత‌రం పిటిష‌న్‌ను కొట్టేసింది.

ఎవ‌రు? ఏం జ‌రిగింది?

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో అవినీతికి పాల్ప‌డ్డారంటూ.. వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబుపై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. క‌ర్నూలులో ఉన్న ఆయ‌న‌ను హ‌ఠాత్తు గా అరెస్టు చేసి రోడ్డు మార్గంలో రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించారు. అక్క‌డే 53 రోజుల పాటు నిర్బంధించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. అనంత‌రం.. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది.

అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడ కేంద్రంగా న‌డిచే సాయంకాల దిన‌ప‌త్రిక స్వ‌ర్ణాంధ్ర ప‌త్రిక సంపాద‌కుడు బాల‌గంగాధ‌ర తిల‌క్ తొలుత హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని కోర్టు కొట్టివేయ‌డంతో ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా దీనిని విచారించిన కోర్టు.. పిటిష‌న‌ర్‌కు- ఈ బెయిల్ ర‌ద్దుకు సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించింది. మీరు ఎవ‌రు? ఈ బెయిల్ పిటిష‌న్‌తో మీకు ఉన్న సంబంధం ఏంటి? అని నిల‌దీసింది. కోర్టు స‌మ‌యాన్ని వృథా చేస్తే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తూ.. పిటిష‌న్‌ను కొట్టి వేసింది.