అనంతపురంలో రాజకీయ రచ్చ రేగింది. కూటమి పార్టీల నేతల మధ్య మాటల మంటలు రేగాయి. ము ఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి.. బీజేపీ నేతలకు మధ్య భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొన్నాల్లుగా కడపలోని ఓ విద్యుత్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిద విషయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి, బీజేపీ నేత, జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. నువ్వా-నేనా అన్నట్టుగా ఇద్దరూ రాజకీయంగా రచ్చ చేసుకున్నారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు సర్దుమణిగినా.. జేసీ మాత్రం అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ రచ్చ ఏకంగా.. పార్టీల వరకు చేరింది. మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సత్య కుమార్ యాదవ్ ప్రతిస్పందించే వరకు చేరింది.
అసలు ఏం జరిగింది?
కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31 అర్ధరాత్రి.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించామని జేసీ చెబుతున్నారు. అయితే.. ఈ కార్యక్రమాల్లో మహిళలతో నృత్యాలు చేయించారని.. పేర్కొంటూ.. బీజేపీ మహిళానాయకులు మాధవీలత, యామని శర్మలు జేసీని విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నృత్యాలేంటని వారు ప్రశ్నించారు. దీనిపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు హిజ్రాల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ జేసీ నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో, తన అడ్డాలో కార్యక్రమం నిర్వహిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఆర్ ఎస్ ఎస్ విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలకు ఏం నొప్పి వచ్చిందని నిలదీశారు. ఇదేసమయంలో గతంలో జరిగిన జేసీ ట్రావెల్స్
బస్సు దహనం కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ దహనం వెనుక బీజేపీ నేతలు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలా.. ఒక విషయం నుంచి మరో విషయానికి ఇది పాకి పోయి.. రాజకీయ రచ్చకు దారి తీసింది.
సత్య వాక్యం!
జేసీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి , బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. కూటమి పార్టీలు సఖ్యతతో మంచి పాలన అందిస్తుంటే.. జేసీ లాంటివారు చెడగొడుతున్నారని అన్నారు. జేసీ తన వయసుకు తగిన విధంగా మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడాతడో తెలియదని.. ఎక్కడో ఏదో బస్సు కాలితే.. దానిని బీజేపీకి ఎలా అంట గడతారని అన్నారు. గతంలో జేసీ వ్యాపారాలపై అనేక ఆరోపణలు వచ్చాయని.. బస్సులు ఎక్కడి నుంచి తెచ్చారో ఏం చేస్తారో.. విమర్శలు వచ్చాయన్నారు. కానీ, వాటిపై తాము ఎక్కడా స్పందించలేదన్నారు. ఇలా అర్ధం పర్థం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చక్కగా అన్యోన్యంగా పాలన చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అంశాలను తీసుకుని రాష్ట్ర సమస్యలుగా ప్రొజెక్టు చేస్తూ.. బీజేపీపై ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు.