వైసీపీ పాలనలో ఐఏఎస్ అధికారులపై వైసీపీ నేతలు అధికారం చలాయించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మరికొందరు అధికారులేమో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో సినిమా టికెట్ల మొదలు ఇసుక దోపిడీ వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని, ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని పవన్ ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థలో ఎందుకు అంత నిస్సహాయత ఉందని నిలదీశారు.
తాజాగా జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు ఆ అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కల్గించిందని అన్నారు. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతోందని, ప్రజలు తిరగబడుతారని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాలన వల్ల 10 లక్షల కోట్లు అప్పు అయిందని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పవన్ చెప్పారు.
కానీ, చంద్రబాబు వంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో, సమిష్టి కృషితో ఏపీ పునర్నిర్మాణం దిశగా ముందుకు పోతోందని చెప్పారు. రాళ్లు, రప్పలతో ఉన్న భూములను చంద్రబాబు ఓ మహా నగరంగా మార్చారని, హైటెక్ సిటీ నిర్మించారని ప్రశంసించారు. గొప్ప పాలనాదక్షత ఉన్న లీడర్ మనకు ఉండటం మన బలమని కొనియాడారు.
కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవహారం ఆందోళన కలిగించిందని, కసబ్ వంటి వారు ఈ సీ పోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడినా ఆశ్చర్యం లేదని చెప్పారు. పాలన ఎలా ఉండకూడదో కేంద్రంలో పెద్దలు వైసీపీ పాలనను ఉదాహరణగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు, బ్యూరోక్రాట్‌లు స్వేచ్ఛగా, సమర్ధవంతంగా పనిచేసి వ్యవస్థలను బలోపేతం చేయాలని, పాలనను గాడిలో పెట్టాలని కోరారు.