పవన్ మరో షిప్‌ను ఎందుకు చెక్ చేయలేదు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ చర్యలను ప్రశంసించినప్పటికీ, పర్యటనపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ అనుభవం ఉన్న రంగం కాబట్టే షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, కానీ ఇందులో దాగున్న ఉద్దేశ్యాలు ఏమిటని ప్రశ్నించారు. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్‌లు పవన్‌తోనే ఉన్నారని, షిప్ లోకి ప్రవేశానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పవన్‌కు షిప్ లోకి అనుమతి ఇవ్వకుండా ఆపినవారెవరు? చంద్రబాబు హస్తం ఉందా లేక పవన్ స్వయంగా అబద్ధం చెప్తున్నారా అని సందేహాలు వ్యక్తం చేశారు.

పవన్‌ కల్యాణ్ స్టెల్లా షిప్‌ను సీజ్ చేయమని చెప్పడం వెనుక కారణాలను నాని ప్రశ్నించారు. కెన్ స్టార్ అనే మరో షిప్ వద్ద ఎందుకు వెళ్లలేదని, ఆ షిప్‌కు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నిలదీశారు. కెన్ స్టార్ షిప్ ద్వారా 42 వేల టన్నుల బియ్యం ఎగుమతి అవుతుందని, ఈ ఎగుమతులు మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంబంధించిన వ్యక్తి వేల్పూరి శ్రీనివాసరావు పేరు మీద ఉన్నాయని ఆరోపించారు. వేల్పూరి శ్రీనివాసరావు ఎగుమతి చేస్తున్న బియ్యంలో అక్రమ బియ్యం లేదని ఎలా నిర్ధారిస్తారని నాని ప్రశ్నించారు.

వేల్పూరి శ్రీనివాసరావు బియ్యంలో కూడా పీడీఎస్ బియ్యం ఉండదనే గ్యారెంటీ ఎవరు ఇస్తారని నాని నిలదీశారు. స్టెల్లా షిప్‌కే ఎందుకు ఫోకస్ చేశారని, పవన్ సీరియస్‌గా ఉంటే కెన్ స్టార్ షిప్ వద్ద కూడా నిలదీసేవారని అన్నారు. పవన్ కల్యాణ్ కార్యాచరణపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, పవన్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికే ఈ పర్యటన చేశారని పేర్ని నాని ఆరోపించారు. పవన్ నిజంగా శుద్ధిచేతనతో పనిచేస్తున్నారా లేక ఈ ఘటన రాజకీయ నాటకమా అనే ప్రశ్నలను విసురుతూ, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.