రెమీ లుసిడి.. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ వ్యక్తికి అత్యంత ఎత్తైన భవనాలు ఎక్కడం అలవాటు. ప్రమాదాలతో చెలగాటం చేస్తూ.. సాహసాలకు పాల్పడుతూ.. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. డేర్ డేవిల్ స్కై స్క్రేపర్‌గా పేరొందిన రెమీ.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆకాశ హర్మ్యాలను అధిరోహించాడు. కానీ చివరకు ఓ ఎత్తైన భవనం మీద నుంచి పడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన హాంకాంగ్‌లో సోమవారం జరిగింది. అక్కడి ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడు. హాంకాంగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు లుసిడి ఆ భవనం వద్దకు చేరుకున్నాడు. 40వ అంతస్తులో తన స్నేహితుడు ఉంటాడని సెక్యూరిటీకి చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. కానీ లుసిడి ఎవరో తనకు తెలియదని ఆ అంతస్తులో ఉండే వ్యక్తి భద్రత సిబ్బందికి చెప్పేలోపే లుసిడి ఎలివేటర్‌లో పైకి వెళ్లాడు. ఆ తర్వాత 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో లుసిడి పైకి వెళ్లినట్లు తెలిసింది. కానీ అతను భవనం మీదకు చేరుకోలేదని అక్కడివాళ్లు అంటున్నారు.
లుసిడి అదుపుతప్పి కింద పడిపోయాడు. అయితే మధ్యలో 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీకి బయట చిక్కుకుపోయాడు. సాయం కోసం ఆ కిటికీని బలంగా తన్నాడు. ఆ సమయంలో అతణ్ని.. ఆ పెంట్‌హౌస్ పనిమనిషి కిటికీ బయట చూసింది. కానీ అక్కడి నుంచి పట్టు తప్పడంతో లుసిడి నేరుగా కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి పడడంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి అధికారులు లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఎత్తైన భవనాలు ఎక్కుతూ సాహహాలకు పాల్పడే లుసిడి.. చివరకు అలాంటి ప్రయత్నంలోనే ప్రాణాలు వదిలాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates