‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొదటి వరుసలో వినిపించే పేరు ఆదిత్య ధర్. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్, ఇప్పుడు ‘ధూరందర్ 2’తో మరోసారి తన సత్తా చాటుతున్నారు. నేడు విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా, తను రాసుకున్న కథల ద్వారా తనే ఒక ధూరందర్‌లా మారిపోయారు ఆదిత్య.

ఆదిత్య ధర్ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. చిన్నతనంలో డిస్లెక్సియాతో పోరాడాడు. అంటే చదవడం, రాయడం పదాల ఉచ్చారణలో ఇబ్బంది కలిగించే ఒక రకమైన ‘లెర్నింగ్ డిజబిలిటీ’. అలాగే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. వరుస ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా, తన సోదరుడితో కలిసి ‘బి62 స్టూడియోస్’ అనే సొంత ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించుకున్నారు. స్టార్ల ఇమేజ్ వెనుక పరుగెత్తకుండా, కేవలం దేశభక్తి బలమైన కథాంశాలనే తన ఆయుధాలుగా మార్చుకున్నారు. 

‘ధూరందర్’ మొదటి భాగం ఇచ్చిన భారీ విజయం తర్వాత, ఇప్పుడు రెండో భాగం కూడా అదే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆదిత్య చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. బాలీవుడ్ మెచ్యూర్డ్ హీరోయిన్ యామీ గౌతమ్‌ను వివాహం చేసుకున్న ఈయన, గ్లామర్ ప్రపంచానికి దూరంగా కుటుంబంతో సమయాన్ని గడపడానికే ఇష్టపడతారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను లేదా నెగటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తనే చూసుకుంటారు. 

ఎంత పేరు వచ్చినా గర్వం లేకుండా ప్రైవేట్ లైఫ్ గడపడం తన స్టైల్. అందుకే ఆదిత్య వ్యక్తిత్వానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా మేకింగ్‌లో ఆదిత్య ధర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఉండే ఇంటెన్సిటీ, ఎమోషన్స్ పండించడంలో చూపే మెజారిటీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.

‘ధూరందర్ 2’ విషయంలో కూడా  ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ సౌండ్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేవలం దేశభక్తి సినిమాలే కాకుండా, టెక్నికల్ గా కూడా ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇప్పుడు వస్తున్న టాక్ చూస్తుంటే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం. ఇక ఆదిత్య ధర్ తన కష్టార్జితంతో బాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఫోకస్ కూడా ఇప్పుడు ఈ దర్శకుడిపై పడింది. మరి రానున్న రోజుల్లో ఈ ధూరందర్ దర్శకుడు ఎవరితో వర్క్ చేస్తాడో  చూడాలి.