నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే చాలామందికి ఓటములు, అవమానాలు ఎక్కువగా ఎదురవుతాయేమో అన్న అపోహ కలుగుతుంది. కానీ వాస్తవానికి ఈ పేరుకు అలాంటి ప్రతికూల అర్థం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
“పరాభవ” అనే పదాన్ని విభజిస్తే –
“పరా” అంటే పరాశక్తి, పరాభట్టారిక (లలితాదేవి),
“భవ” అంటే భవుడు, పరమశివుడు.
అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల కరుణ, ఆశీస్సులతో భక్తులు రక్షణ పొందుతారని ఆధ్యాత్మికంగా భావిస్తారు. అందువల్ల ఇది అపశకునం కాదు, దైవానుగ్రహాన్ని సూచించే శుభనామ సంవత్సరమని విశ్వాసం.
మామిడి తోరణాల అందం, వేపపువ్వుల పరిమళం, పచ్చని ప్రకృతి మధ్య తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఉగాది పర్వదినం ప్రతి ఇంటికి కొత్త ఆశలు నింపుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు) మన జీవితంలోని సుఖదుఃఖాలను ప్రతిబింబిస్తాయి.
అందుకే ఈ పరాభవ నామ సంవత్సరంలోనూ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలని పండితులు సూచిస్తున్నారు. నూతనోత్సాహంతో, సానుకూల దృక్పథంతో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
