ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు పెడుతున్న ఏపీ తెలంగాణ థియేటర్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. నిన్న రాత్రి దురంధర్ ది రివెంజ్ తెలుగు షోలు రద్దు చేయడం తీవ్ర అసహనానికి గురి చేసినప్పటికీ హిందీ షోలు సరైన సమయంలో పడటంతో పరిస్థితి చక్కబడింది, మెయిన్ సెంటర్స్ అన్నీ హౌస్ ఫుల్స్ పడ్డాయి.

అసలు విశేషం ఏంటంటే లేట్ నైట్ పదకొండు గంటలకు వేసిన షోలకు కూడా టికెట్లు అయిపోవడం. బయటికి వచ్చేటప్పటికి అపరాత్రి మూడు గంటలవుతుందని తెలిసినా ఫ్యామిలీస్ తో సహా వెళ్లడం దురంధర్ క్రేజ్ ఏంటో స్పష్టం చేస్తుంది. వీకెండ్ దాకా ఈ జోరులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. రివ్యూలు, పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉండటం రణ్వీర్ సింగ్ మూవీకి చాలా ప్లస్ కానుంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా ఉదయం నాలుగు నుంచి మొదలైపోయింది. కంటెంట్ గురించి పాజిటివ్, నెగటివ్ రెండూ కలిసిన కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్టామినా జనాన్ని హాళ్లకు రప్పిస్తోంది. ఏపీలో తెల్లవారక ముందే పడిన షోలు అభిమానులతో కిటకిటలడాయి. మరీ ఓజి రేంజ్ యుఫోరియా కనిపించలేదు కానీ ఉన్నంతలో మెయిన్ థియేటర్లన్నీ జనాలతో నిండుగా కనిపించాయి.

ఈ జోరు వీకెండ్ దాకా కొనసాగితే భారీ రెవిన్యూ జనరేట్ అవుతుంది. పవన్ సినిమా ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ దురంధర్ లాంటి హిందీ సినిమాకు ఈ స్థాయి స్పందన చూసి దశాబ్దం పైనే అయ్యింది. ఎందుకంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు సైతం హైదరాబాద్ లో ఎర్లీ ప్రీమియర్లు వేయలేక మెయిన్ డేట్ కి రిలీజ్ చేసిన ట్రెండ్ ఇది. అలాంటిది రణ్వీర్ సింగ్ ఈ ఘనత సాధించడం చూస్తే దురంధర్ బ్రాండ్ ఏ స్థాయిలో చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ట్రేడ్ హ్యాపీగా ఉంది.