పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు కూడా త‌మ య‌జ‌మానుల ప‌ట్ల అంతే ప్రేమ‌ను పెంచుకుంటాయి. ఒక్కొక్క‌సారి య‌జ‌మానులు మృతి చెందిన సంద‌ర్భంలో పెంపుడు జంతువులు కూడా నిద్రాహారాలు మానేసి ప్రాణాలు విడిచిన ఘ‌ట‌న‌లు కూడా వెలుగుచూస్తున్నాయి. అయితే.. దీనికి భిన్నంగా తాజాగా ఓ పెంపుడు పిల్లి మృతి చెందింద‌న్న దిగులుతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోనే చోటు చేసుకుంది.

ఏం జ‌రిగింది?

వ‌రంగ‌ల్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని హైద‌రాబాద్‌లోని ఓ హాస్ట‌ల్ లో ఉంటూ.. డిగ్రీ చ‌దువుతోంది. ఆమెకు తోడు.. ఓ పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లిని గారాబంగా చూసుకునేది. ఇటీవ‌ల ఆ పిల్లి.. అనారోగ్యానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌తో స‌ద‌రు విద్యార్థిని దిగులు పెట్టుకుని.. తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. అప్పటినుంచి ఆ విద్యార్థిని కాలేజీకి కూడా వెళ్ల‌కుండా హాస్ట‌ల్ గ‌దిలో ఒంట‌రిగా ఉండ‌డం ప్రారంభించింది.

అప్ప‌టి వ‌ర‌కు ఫ్రెండ్స్‌తో క‌లివిడిగా ఉన్న ఆమె.. పిల్లి మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఎవ‌రితోనూ క‌ల‌వ‌డం మానేసింది. అంతేకాదు.. బుధవారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. ఆమె ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. సాయంత్రం తిరిగి వ‌చ్చిన విద్యార్థినులు హాస్ట‌ల్ గ‌దిలో విద్యార్థిని రూమ్ లో నుంచి ఎలాంటి అలికిడీ లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి.. త‌లుపులు తెరిచి చూశారు.

ఫ్యాన్‌కు వేలాడుతున్న విద్యార్థిని చూసి అంద‌రూ ఖిన్నుల‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించి.. బాడీని కిందికి దింపారు. ప్రాథమిక విచారణ చేప‌ట్టిన పోలీసులు.. కేవ‌లం పిల్లిపై పెంచుకున్న మ‌మ‌కారంతోనే విద్యార్థిని తీవ్ర ఆవేద‌న‌కు గురై.. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు నిర్ధారించారు. వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. కాగా.. ఈ వ్య‌వ‌హారంపై నెటిజ‌న్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెంపుడు జంతువుల‌పై ప్రాణాలు పెట్టుకోవ‌డం మంచిదేన‌ని.. కానీ, ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం స‌రికాద‌ని మెజారిటీ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.