కుప్పుకూలిన కివీస్..చెత్త రికార్డు

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్రాత్మక ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు సృష్టించాడు. అయితే, కివీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఓ వైపు అజాజ్ ప్రదర్శనతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న కివీస్…మరోవైపు భారత్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అపప్రదను మూటగట్టుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరంభంలో పర్యాటక జట్టును 3 వికెట్లతో హైదరాబాదీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్లు చెలరేగారు. రవిచంద్రన్ అశ్విన్ 8 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి న్యూజిల్యాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

ఇక, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ 1 వికెట్ తీశారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో టామ్ లాథమ్, జేమిసన్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 263 పరుగుల ఆధిక్యం లభించడంతో కివీస్ కు ఫాలో ఆన్ తప్పలేదు. అయితే, అనూహ్యంగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. మూడో రోజు పిచ్ మరింతగా బౌలింగ్ కు అనుకూలించే అవకాశముండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.