సుడిగాడు అంటే వీడేరా? అన్నట్లు అనిపించే ఉదంతమిది. అదే సమయంలో.. ఎంత లక్ ఉన్నా కానీ దరిద్రం మాత్రం అతగాడి వెంట పడుతూనే ఉందన్నట్లుగా ఉండే ఈ వ్యవహారం చాలా సిత్రంగా ఉంటుంది. యూఏఈలో ఉండే ప్రవాస భారతీయుడు ఒకరు (నహీల్ నిజాముద్దీన్) యూఏఈలో పని చేస్తున్నాడు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబుదాబి సిరీస్232 డ్రాలో ఇతగాడు ఏకంగా రూ.20 కోట్లకు విజేతయ్యాడు. సెప్టెంబరు 26న లాటరీ టిక్కెట్ కొన్న అతడు కాంటాక్టు నెంబర్ల కింద రెండు ఫోన్ నెంబర్లు.. కేరళలోని తన పర్మినెంట్ అడ్రస్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. లాటరీ తగిలి.. అతని పేరును ప్రకటించారు కానీ.. తానే విజేతనంటూ నిర్వాహకుల వద్దకు రాలేదు. అతడికి ఇప్పటివరకు అధికారిక సమాచారం వెళ్లలేదు. దీనికి కారణం అతడు కేరళ అడ్రస్ ఇవ్వటమేనని చెబుతున్నారు. అతను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు పని చేయకపోవటంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతడి గురించి ప్రాథమిక వివరాల కోసం లాటరీ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అతను అబుదాబిలో ఉంటాడన్న ప్రాథమిక సమాచారాన్ని గుర్తించారు.
అయితే.. విజేతకు తాను గెలుచుకున్న లాటరీ సొమ్ము మొత్తాన్ని అందజేసే వరకు మాత్రం తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంటామని సదరు సంస్థ చెబుతోంది. ఈ మొత్తం ఉదంతం విన్నంతనే దురదృష్టం ఒక్కోసారి అదృష్టం కంటే కూడా బలమైనది ఏమో అనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates