కరోనా వేళ.. అన్ని కంపెనీలకూ ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రెండు మూడు నెలలుగా మార్కెట్ ఎలా కుదేలవుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముఖేష్ అంబానీ సంస్థ రిలయెన్స్ జియో మాత్రం దూసుకెళ్తున్నాయి. ఆ సంస్థలోకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఆ సంస్థలోకి ఏకంగా రూ.78 వేల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయంటే ఆ సంస్థ ఎలా వెలిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ప్రైవేట్ ఈక్విటీ ఫిర్మ్ కేకేఆర్.. రిలయన్స్ జియోలో రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఐతే అంత మొత్తం పెట్టుబడి పెట్టినా సంస్థలో దాని వాటా 2.32 శాతం మాత్రమే. జియో సంస్థ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఏకంగా రూ.5.16 లక్షల కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆసియాలో కేకేఆర్ సంస్థ అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం.
గత నెల రోజుల వ్యవధిలోనే జియో సంస్థలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. సోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ ఆ సంస్థలో ఏకంగా రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టింది. తద్వారా దానికి 9.99 శాతం వాటా దక్కింది. విస్తా సంస్థ రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటాను కొనుగోలు చేయగా.. జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లతో 1.34 శాతం వాటాను, సిల్వర్ లేక్ రూ.5,656 కోట్లతో 1.15 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి.
ఇలా నెల రోజుల వ్యవధిలో జియో ఏకంగా రూ.78,562 కోట్ల పెట్టుబడులు సంపాదించింది. మూడేళ్ల కిందట టెలికాం రంగంలోకి రావడంతోనే ప్రకంపనలు రేపిన జియో ఇన్ఫోకామ్.. ప్రస్తుతం దాదాపు 39 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో దేశంలో నెంబర్ వన్ టెలికాం సంస్థగా కొనసాగుతోంది. జియో కింద జియో సినిమా, జియో సావన్ లాంటి ఉప సంస్థలు కూడా ఉన్నాయి.