ఇదేం గోలరా బాబూ!... ఇవ్వ‌రు, ఇవ్వ‌నివ్వ‌రు!

  ఇదేం గోలరా బాబూ!... ఇవ్వ‌రు, ఇవ్వ‌నివ్వ‌రు!

అమ్మా పెట్ట‌దు- అడుక్కోనివ్వ‌దు... ఇది మ‌న‌కు బాగా తెలిసిన సామెతె. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితి కూడా అచ్చూ ఇలాగే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.... తెలుగు నేల విభ‌జ‌న నేప‌థ్యంలో క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో కొత్త ప్ర‌యాణం మొద‌లెట్టిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు చ‌ట్ట‌బ‌ద్ధంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సి ఉన్న అంశాన్ని చాలా తెలివిగా అట‌కెక్కించిన బీజేపీ స‌ర్కారు... ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ కొత్త పాట పాడింది.

ఏదైతేనేం... రాష్ట్రం బాగుప‌డాల‌న్న భావ‌న‌తో ప్ర‌త్యేక ప్యాకేజీకి ఏపీ ప్ర‌భుత్వం స‌రేన‌న్నా.. ప్యాకేజీనీ చాలా తెలివిగానే అట‌కెక్కించేసింది. ఇదేంట‌ని అడిగితే... ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కార‌ణం చెబుతూనే ఉంది. మొత్తంగా ఏపీకి తాను  ప్ర‌త్యేక హోదా కాదు క‌దా... ప్ర‌త్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేది లేదని న‌రేంద్ర మోదీ స‌ర్కారు తేల్చేసింద‌నే చెప్పాలి.

స‌రే ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... ఇప్పుడు మ‌రో ఘోర త‌ప్పిదానికి ఆ పార్టీ న‌డుం బిగించింద‌నే చెప్పాలి. తాను అధికారంలోకి వ‌స్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని, దానిపైనే తొలి సంత‌కం పెడ‌తాన‌ని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే... అదెలా కుదురుతుంద‌ని బీజేపీ త‌న‌దైన వేషాలు వేస్తోంది. అంటే అమ్మా పెట్ట‌దు...అడుక్కోనివ్వ‌ద‌నే సామెత‌ను నిజం చేసిన‌ట్టే క‌దా.

ఈ క‌థేంటో ఓ సారి చూద్దాం ప‌దండి. నిన్న త‌ప‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ... అందులో ఏపీకి ప్ర‌త్యేక హోదాను చాలా ప్ర‌ముఖంగానే ప్ర‌స్తావించింది. తాము అధికారం చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీర‌తామ‌ని, అధికారం చేప‌ట్టిన త‌ర్వాత తొలి నిర్ణ‌యం ఏపీకి ప్ర‌త్యేక హోదానేన‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చాలా క్లారిటీగానే ప్ర‌క‌టించారు.

మేనిఫెస్టోలో అనే కాకుండా ఎప్పుడు ఏపీకి వ‌చ్చినా... ఏపీ నేత‌లు ఢిల్లీకి వెళ్లినా... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీర‌తామ‌ని, విభ‌జ‌న క‌ష్టాల నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున ప‌డేస్తామ‌ని కూడా రాహుల్ గాంధీ చెబుతున్నారు.  ఈ విష‌యంలో ఆ పార్టీకి చిత్త‌శుద్ధి కూడా ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుద‌ల కాగానే... దానిపై రియాక్ట్ అయ్యేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓ తొండి వాద‌న‌ను వినిపించారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పించిన జైట్లీ... అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే... ఆ నిధులెక్కడి నుంచి తెస్తార‌ని కూడా ఆయ‌న కాంగ్రెస్ పార్టీని ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆగ‌ని జైట్లీ... ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఎవ‌రు ఇచ్చినా స‌హించేది లేద‌న్న కోణంలో మ‌రో వాద‌న‌ను వినిపించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే... తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేసిన జైట్లీ... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే.. దేశంలో లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న రీతిలో గ‌గ్గోలు పెట్టారు. ఇదంతా చూస్తుంటే... రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా బీజేపీ చేయాల్సిన‌దంతా చేస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ స‌రికొత్త వాద‌న‌ను బ‌య‌ట‌పెట్టుకున్న బీజేపీ... ఏపీ ప్ర‌జ‌ల దృష్టిలో మ‌రింత మేర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంద‌నే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English