ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు రాగానే ఆయన దానిని నోట్ చేసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం అంధ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన సమావేశంలో దీపిక తన గ్రామమైన తంబలహెట్టి రోడ్డు సమస్యను వివరించగా, ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. క్రీడాకారిణి విజ్ఞప్తిని గమనించిన పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేసి, రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
దీంతో శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి ప్రాంతాన్ని పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో, జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
మధ్యాహ్నం వినిపించిన ఒక విజ్ఞప్తికి సాయంత్రానికే ఆమోదం లభించడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాకారుల సమస్యలపై ఇంత వేగంగా స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates