బాబు స్పెషల్: శాంతి వనంలోనూ పెట్టుబడుల ధ్యానం!

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. విదేశాలకు కూడా వెళ్లి పెట్టుబడి సంస్థలను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించారు.

ఇది పూర్తిగా యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఇక్కడ కూడా పెట్టుబడులపైనే ఆలోచన చేశారు. ఏపీలో కూడా ఇలాంటి శాంతి వనాన్ని ఏర్పాటు చేసే అంశంపై కన్హాను నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి. పటేల్ దాజీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని అమరావతి, విశాఖలో ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.

ముఖ్యంగా మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హార్ట్ ఫుల్ నెస్ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ఇలాంటి కేంద్రాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్నాళ్ల కిందట విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం విజయవంతమైన తీరు, దీనికి ప్రపంచ స్థాయిలో వచ్చిన రికార్డులు, అవార్డులను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ శాంతి వనం తరహా ప్రాజెక్టు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖలో యోగా కేంద్రం, అమరావతిలో హార్ట్ ఫుల్ నెస్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎక్కడ ఉన్నా పెట్టుబడులపైనే ధ్యానం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం.