ఈ సినిమాకి శకునాలు బాలేదు సుమీ!

  ఈ సినిమాకి శకునాలు బాలేదు సుమీ!

రొటీన్‌ సినిమాలతో కొన్నిసార్లు అదృష్టం కలిసి వచ్చి పాస్‌ అయిపోవచ్చు కానీ అది అన్నివేళలా జరగదు. గత యేడాది రాజా ది గ్రేట్‌, ఎంసిఏ లాంటి నాసిరకం సినిమాలతో సక్సెస్‌ అయిపోయిన దిల్‌ రాజు తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సక్సెస్‌ ఫార్ములా కిటుకు కనిపెట్టేసానన్నట్టు మాట్లాడాడు. అయితే లవర్‌, శ్రీనివాస కళ్యాణంతో వాస్తవం తెలిసి వచ్చింది. దీంతో ప్రేక్షకులు చెడు ప్రభోదించే చిత్రాలను ఆదరిస్తున్నారని నిందలు వేసాడు.

ఇదిలావుంటే ఆయన బ్యానర్‌నుంచి వస్తోన్న 'హలో గురూ ప్రేమకోసమే' ట్రెయిలర్‌ విడుదలయింది. రామ్‌, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రంపై అసలు బజ్‌ లేదు. ఆడియో కూడా క్లిక్‌ అవకపోవడంతో అంచనాలు పెంచే బాధ్యత ట్రెయిలర్‌పై పడింది. కానీ ట్రెయిలర్‌ చూస్తే మచ్చుకైనా ఒక మెచ్చుకునే మాట కానీ, షాట్‌ కానీ లేదు. ఇప్పటికే జనాలకి వెగటు పుట్టేసిన పులిహోర ఫార్ములానే మరోసారి కలిపేసినట్టున్నారు. ఈ ట్రెయిలర్‌కి సోషల్‌ మీడియాలో వస్తోన్న రియాక్షన్‌ని బట్టి మేటర్‌ ఏమిటనేది ఈపాటికి బోధ పడి వుండాలి.

ఈ చిత్రానికి మరేదీ పోటీ కాకుండా తన బలాన్ని దిల్‌ రాజు వాడాడనే వదంతులున్నాయి. మరి ఇంత నాసి రకంగా కనిపిస్తోన్న కంటెంట్‌తో తన పబ్లిసిటీ బలాన్ని వాడి ఎలా గట్టున పడేస్తాడనేది చూడాలి. రేపు విడుదలయ్యే 'అరవింద సమేత' ఫలితం ఈ చిత్రాన్ని డైరెక్టుగా ప్రభావితం చేస్తుంది. అరవింద కనుక హిట్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే దాని నుంచి దీనివైపుకి దృష్టి తిప్పుకోవడానికి చాలా కష్టపడాలి. లేదంటే పండగకి కొత్త సినిమా అడ్వాంటేజ్‌ని దసరా రోజున రిలీజయ్యే ఈ చిత్రం క్యాష్‌ చేసుకోగలుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English