కమిన్స్ నోట పాపులర్ తెలుగు డైలాగ్స్

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో చాలా చోట్లకు తమ సొంత రాష్ట్రంలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ జట్ల అభిమానుల్లో లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి వాటికి తిరుగులేని ఆదరణ తీసుకురావడంలో యాజమాన్యాలు విజయవంతం అయ్యాయి.

కానీ ఐపీఎల్‌లో లోకల్ ఫీలింగ్ తక్కువగా ఉండి, స్థానికంగా ఆదరణ తక్కువ ఉన్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సీజన్ ముంగిట హైదరాబాద్ ఫ్యాన్స్.. లోకల్ టీంను ఎందుకు సపోర్ట్ చేయరు అంటూ ఆ జట్టు తరఫున కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

ఐతే ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆటతీరుతో కథ మారింది. ఐపీఎల్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని దూకుడుతో భారీ స్కోర్లు సాధిస్తూ దూసుకెళ్తోంది హైదరాబాద్. కెప్టెన్ కమిన్స్‌తో పాటు క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా అదరగొడుతున్నాడు. దీంతో స్థానిక అభిమానుల్లో సన్‌రైజర్స్‌లో అభిమానం పెరుగుతోంది. ఈ జట్టును ఓన్ చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో ఆదరణను ఇంకా పెంచేందుకు సన్‌రైజర్స్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మహేష్ బాబుతో జట్టును కలిపించిన సంగతి తెలిసిందే. తాజాగా కమిన్స్ పాపులర్ తెలుగు సినిమా డైలాగులతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో ‘‘నేను ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’.. ‘‘కమిన్స్ అంటే క్లాస్ కాదు.. మాస్, ఊర మాస్’’.. ‘‘ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్’’ లాంటి డైలాగులతో కమిన్స్ అదరగొట్టాడు.