ఔను.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు

మరో సినిమా జంట పెళ్లితో ఒక్కటైంది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న మలయాళ ఆర్టిస్టులు అపర్ణ దాస్, దీపక్ పరంబోల్ పెళ్లి చేసుకున్నారు. మలయాళ నటి, నటుడు పెళ్లాడితే మనకేంటి అనుకోవచ్చు. వీళ్లిద్దరూ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. గత ఏడాది విడుదలైన మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఆదికేశవ’లో హీరో సోదరిగా అపర్ణ కీలక పాత్ర పోషించింది.

ఇక ఇటీవలే బ్లాక్‌బస్టర్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో దీపక్ పరంబోల్ ముఖ్య పాత్ర చేశాడు. మలయాళ సినీ చరిత్రలోనే భారీ చిత్రాలకు కూడా సాధ్యం కాని విధంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలో కీలక పాత్రతో దీపక్‌కు మంచి పేరే వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది.

అపర్ణకు తమిళంలో మంచి పేరే ఉంది. ఆమె కెరీర్లో బెస్ట్ ఫిలిం.. డడా. ‘బిగ్ బాస్’ ఫేమ్ కవిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓటీటీ ద్వారా వేరే భాషా ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తర్వాతే అపర్ణకు తెలుగులో ‘ఆదికేశవ’ చిత్రం చేసే అవకాశం వచ్చింది. తమిళం, మలయాళంలో కలిసి అపర్ణ రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది.

దీపక్ కూడా చాలా సినిమాల్లోనే నటించాడు. వీళ్లిద్దరూ రెండేళ్ల కిందట్నుంచి ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకుని ఒక్కటైందీ జంట.