ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అని తెలిసినప్పటికీ కల్కి 2898 ఏడిలో దర్శకుడు నాగఅశ్విన్ సృష్టించబోయే ప్రపంచం ఎలా ఉంటుందోననే ఉత్సుకత ప్రేక్షకుల్లో అంతకంతా పెరుగుతోంది. ద్వాపరయుగం నుంచి కలియుగం దాకా వివిధ అంశాలను ముడిపెడుతూ ఆవిష్కరించే అద్భుతం గురించి టీజర్స్ రూపంలో శాంపిల్స్ ఇవ్వడం అంచనాలను అంతకంతా పెంచుతోంది. నిన్న అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర పరిచయం మీద సోషల్ మీడియాలో అప్పుడే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కనిపిస్తోంది. కేవలం నిమిషం లోపే నిడివి అయినా హైప్ ని మాత్రం టన్నుల్లో పెంచేస్తోంది.
నిజానికి నాగ అశ్విన్ చేస్తోంది చాలా పెద్ద సాహసం. ఇతిహాసాల మీద అంతగా అవగాహన లేని ఫైవ్ జి జెనరేషన్ కి వాటి గొప్పదనాన్ని చూపించేలా ఒక సూపర్ కాన్సెప్ట్ తీసుకుని దానికి మహాభారతాన్ని జోడించి థ్రిల్ చేయబోతున్నాడు. వేల సంవత్సరాల వెనుక జరిగిన సంఘటనలకు, వర్తమానంలో మానవాళి చూస్తున్న ప్రమాదాలకు ముడిపెట్టి ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ ద్వారా కల్కి ప్రయాణాన్ని ఉన్నతంగా చూపించబోతున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడని ధోరణి కారణంగానే షూటింగ్ కన్నా ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ మీద నాగఅశ్విన్ దృష్టి పెట్టబోతున్నాడు.
ఇక అసలైన విడుదల తేదీ సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కల్కి నిర్మాతల బృందం అశ్వినిదత్, స్వప్న, ప్రియాంకలు దీని మీద నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నారు. మే, జూన్, జూలైలు కలిపి మొత్తం నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నారట. అయితే దేని మీదా ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇంకొంత వేచి చూడక తప్పడం లేదు. ఇంకోవైపు కల్కి ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలిస్తే తమ రిలీజ్ డేట్లను దానికి అనుగుణంగా సెట్ చేసుకునేందుకు ఇతర నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్నది ఒక్కటే. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తరహాలో మరోసారి గందరగోళం రాకుంటే చాలు.