సీనియర్ హీరోలు ఆరు పదుల వయసు దాటాక సోలోగా మార్కెట్ కోల్పోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో లేదా విలన్లుగానో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అందుకే జగపతి బాబు లెజెండ్ నుంచి తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని ఊహించిన దాని కన్నా భారీ డిమాండ్ కు చేరుకున్నారు. శ్రీకాంత్ ఈ సత్యాన్ని గుర్తించే సపోర్టింగ్ రోల్స్ తో సహా కథ నచ్చితే చాలు ఏవీ వద్దని చెప్పడం లేదు. 80 దశకంలో అంకుశం లాంటి బ్లాక్ బస్టర్స్ తో మాస్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ మాత్రం గత కొన్నేళ్లుగా ఒక డైలమాలో ఉండిపోయి చాలా గ్యాప్ తెచ్చేసుకున్నారు.
కల్కి, గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటివి సోలో హీరోగా ట్రై చేశారు కానీ అవి మరీ దారుణంగా పోయాయి. ఫైనల్ గా రూటు మార్చేసి వయసు, ఇమేజ్ కు తగట్టు క్యారెక్టర్లు ఎంచుకుంటున్నారు. గత ఏడాది నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో పోలీస్ ఆఫీసర్ గా ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు కానీ సినిమా మరీ తేడాగా ఉండటంతో ఆశించిన ఫలితం దక్కలేదు. తాజాగా శర్వానంద్ 36లో తండ్రి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తే పాత్రలను ఎంచుకోవడంలో తన పంధా ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ప్రత్యేకంగా మొదటి రోజే సినిమాకు వచ్చే రేంజ్ లో ఫాలోయింగ్ రాజశేఖర్ కు లేకపోయినా సరైన కంటెంట్ పడితే వింటేజ్ స్టైల్ లో ఆయన నటనని చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అప్పట్లో రామ్ చరణ్ ధృవలో అరవింద్ స్వామి పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నా తనకు దక్కలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ వేగంగా సినిమాలు చేస్తే ఆఫర్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా కొనసాగుతూ ఉండగా ఇటీవలే జీవిత సైతం రజనీకాంత్ లాల్ సలాం తో రీ ఎంట్రీ ఇచ్చారు.