వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శనివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిందన్న ప్రభుత్వ ప్రచారం, కొన్ని రిపోర్టులు, అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న పర్యటన కావడం గమనార్హం. పైగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్లడం ఉత్కంఠగా మారింది.
తిరుమల అపవిత్రం అయిందన్న వార్తల నేపథ్యంలో హిందూ సంఘాలు, బిజెపి నేతల నుంచి తీవ్రస్థాయిలో వైసిపి పై విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, నిరసనలతో కూడా తిరుమల తిరుపతి అట్టుడుగుతున్న పరిస్థితి తెలిసిందే. బిజెపి నాయకులు కొందరు జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడికి కూడా దిగారు. ఇంకోవైపు రాష్ట్రంతో సంబంధం లేకపోయినా బిజెపి నాయకులు కొందరు తిరుమల లడ్డు అపవిత్రం కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ తమ నిరసనలను తెలుపుతున్నారు.
ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన కీలకంగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా జగన్ పర్యటనను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు తిరుపతిలో పోలీసు యాక్ట్ 30ని తీసుకొచ్చారు. నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని కూడా అంతర్గత సమాచారం ద్వారా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాస్తవానికి తిరుమలకు పాదయాత్ర ద్వారా వెళ్లాలనుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకొని నేరుగా వాహనంలోనే తిరుమలకు చేరుకోనున్నారు.
మరి ఆయన పాదయాత్ర నుంచి ఎందుకు విరమించుకున్నారు? వెనక్కి తగ్గారా? లేక ఉదేశపూర్వకంగానే ముందు అలా ప్రకటించి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదని గ్రహించిన తర్వాత ఆయన నడక ద్వారా తిరుమలకు వెళ్లడం అనే అంశాన్ని వాయిదా వేసుకున్నారా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదేమైనా జగన్ తిరుమల పర్యటన అయితే ఈరోజు మొదలవుతుంది. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకోవైపు వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని అనుకున్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.