ప్రాయశ్చిత్త దీక్షతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని దశ దిశలకూ తీసుకువెళ్లే ప్రయ త్నం చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుమల శ్రీవారి ప్రసాదంలో అత్యంత దారుణమైన కల్తీ జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో దీనిపై కార్యాచరణను యుద్ధప్రాతిపదికన రూపొందించుకు న్న పవన్ ఆవెంటనే దీక్షకు దిగారు. అయితే.. ఈ దీక్షపై రెండు రూపాల్లో స్పందన వచ్చింది. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడారు.
ఇదేసమయంలో మరికొందరు దీక్షను తప్పుబట్టారు. ఇక, మెజారిటీ మేధావులు.. హిందూ వర్గాలు కూడా.. దీక్షను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో తాను కమ్యూనిస్టు భావాలు ఉన్న నాయకుడినని ఆయనే చెప్పుకొచ్చారు. తనకు చే-గువేరా వంటివారు ఆదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తి.. నేరుగా పోయి పోయి హిందూ సంప్రదాయాన్ని, కల్తీని భుజాన వేసుకుని.. దీక్షకు కూర్చోవడాన్ని మేధావులు పెద్దగా పట్టించుకోలేదు.
ఇక, కీలకమైన మాస్ ఓటింగ్ విషయానికి వస్తే.. పవన్‌కు ఎప్పుడూ ఉన్న ఇమేజే ఇప్పుడు కూడా ఉంది. దీనిలో పెద్దగా వచ్చిన మార్పు కనిపించలేదు. తొలుత మంగళగిరిలో దీక్షను చేపట్టిన పవన్..ఆ వెంటనే.. మరుసటి రోజు దుర్గమ్మ మెట్లు కడిగారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. దీక్షకు తగిన విధంగా ఫోకస్ లభించలేదని.. అందుకే ఆయన మెట్లు కడిగారని.. కొందరు వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విమర్శలు.. ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. దీక్ష తెచ్చిన గ్రాఫ్ ఎంత? అనేది కీలకం.
ఈ విషయంలో పవన్ ఆశించినంత అయితే గ్రాఫ్ పెరగలేదు. దీక్ష చేశారు అంతే! ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన కూటమి పార్టీలు .. పవన్ దీక్షకు దిగడంతో క్రెడిట్ అంతా ఆయనే సొంతం చేసుకుంటున్నారన్న భావనలో మునిగిపోయా యి. దీంతో ఆయా పార్టీలు కూడా.. ఎంత వరకు స్పందించాలో అంతవరకే స్పందించి వదిలేశాయి. ఒక నాయకుడిగా పవన్ కు ఉన్న ఇమేజ్.. దీక్ష ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన ఇమేజ్‌లో పెద్దగా తేడా అయితే కనిపించలేదన్నది విశ్లేషకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates