జగన్ బయటికొచ్చాడు.. మళ్లీ అదే కథ

ఐదేళ్ల పాటు అంతులేని అధికారం అనుభవించాక.. ప్రతిపక్షంలో కొనసాగడం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టంగానే అనిపిస్తున్నట్లుంది.
ప్రతిపక్షంలో ఉన్నపుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ మన మనిషి అనిపించుకున్నాడు. కానీ అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం అయిపోయి జనానికి దూరం అయిపోయాడు.

తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్లీ ఒకప్పట్లా జనాల్లోకి వెళ్తాడనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. అప్పుప్పడూ మొక్కుబడిగా జనాల్లోకి వచ్చి ప్రభుత్వం మీద బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. అదేమంత వర్కవుట్ అవుతున్న సంకేతాలు కనిపించడం లేదు.

వారం పది రోజులకు ఒక గంట పాటు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం.. వెంటనే ఫ్లైట్ ఎక్కి బెంగళూరుకు వెళ్లిపోవడం.. ఇదీ వరస. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వంద రోజుల వ్యవధిలో ఆయన పదిసార్లు బెంగళూరుకు వెళ్లడం గమనార్హం.

ఇక జగన్ రాక రాక బయటికి వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాడు అంటే చాలు.. ఆ రోజు సోషల్ మీడియాలో మీమ్స్‌తో మోత మోగిపోతోంది. ప్రతిసారీ మీమర్లకు బోలెడంత కంటెంట్ ఇచ్చి వెళ్తున్నాడు జగన్. పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాల మీద జగన్ డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రెస్ మీట్ పెడితే.. ఉన్న డ్యామేజ్ తగ్గకపోగా.. కొత్తగా డ్యామేజ్ జరుగుతున్న పరిస్థితి. తిరుమల లడ్డు వివాదానికి తమ ప్రభుత్వం మీద ఆరోపణల మీద నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు.

కానీ అందులో ఆయన వాదన తర్కానికి నిలవలేదు. లడ్డు తయారీలో ఎవరి జోక్యం ఉండదు అని తీర్మానించారు కానీ.. 50 ఏళ్ల నుంచి నమ్మకంగా నాణ్యమైన నెయ్యి అందిస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను ఎందుకు తప్పించి మరీ తక్కువ రేటుకు వేరే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు అన్న దానికి ఆయన దగ్గర సమాధానం లేదు.

ఇదిలా ఉంటే ఎప్పట్లాగే పేపర్లు పట్టుకొచ్చి ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ.. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలు కూడా చదవలేక తప్పు తప్పుగా పలుకుతూ జగన్ పడిన ఇబ్బంది మీమర్లకు మంచి కంటెంట్ ఇచ్చింది. దీని మీద నిన్నట్నుంచి మీమ్స్ మోగిపోతున్నాయి.

తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు దీనికి ముడిపెట్టి జగన్‌ను ట్రోల్ చేస్తున్నారు. బాలినేని రాజీనామా గురించి ప్రస్తావిస్తే జగన్ విచిత్రమైన స్లాంగ్‌లో ఇచ్చిన వివరణ మీద కూడా బోలెడన్ని మీమ్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ వస్తే మీమర్లకు పండగే అనే విషయం మరోసారి రుజువైందనే చెప్పాలి.