ఏలేరు రిజర్వాయర్ కు పోటెత్తిన వరదల కారణంగా.. కాకినాడ జిల్లా పరిధిలోని 62 గ్రామాలు నీట మునిగాయి. వీటి లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఇక్కడ పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలను కలుసుకున్నారు. అయితే.. ఆయన ఉత్తచేతులతో వచ్చి.. తమను పలకిస్తున్నారని కొందరు నిలదీశారు. మరికొందరు సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. ఎక్కువ మంది సాయం అందడం లేదని ఫిర్యాదు చేశారు.
ఈ పర్యటనలో గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంగా గీత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉన్నారు. స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రమణక్క పేటలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు తీరుపై ‘వెక్కిరింపు’ రాజకీయాలు చేశారు. “నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు..” అంటూ ఆయన చిత్రంగా మాట్లాడుతూ.. వెక్కించారు. ఎన్నికలకు ముందు ‘తల్లికి వందనం’ పేరుతో చంద్రబాబు సూపర్ సిక్స్‌లో పథకాన్ని ప్రకటించారు.
దీని ప్రకారం.. ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నా.. వారికి రూ.15000 చొప్పున బ్యాంకులో వేస్తామన్నారు. అయితే.. అధికారంలోకి వచ్చి మూడు మాసాలైనా ఇంకా ఈ నిధులు ఇవ్వడం లేదని.. జగన్ పలు సందర్భాల్లో ఆరోపిస్తూ వచ్చారు. అయితే.. తాజాగా దీనిని వెక్కిరిస్తూ.. రాజకీయాలు చేయడం గమనార్హం. “రా..రా.. రా.. రా.. నీకు పదైదు వేలు.. నువ్రా.. నువ్రా.. నీకు పదైదు వేలు” అంటూ..జగన్ వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ఇదిలావుంటే.. చంద్రబాబు వైఫల్యంతోనే బుడమేరు కారణంగా విజయవాడ శివారు ప్రాంతాలు నీట మునిగాయని జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏలేరు జలాశయానికి కూడా చంద్రబాబు నిర్వాకంతోనే వరదలు వచ్చాయని విమర్శించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్‌లో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పైనుంచి వరదలు వస్తున్నాయని తెలిసినా ఏలేరు రిజర్వాయర్‌ను ఖాళీ చేయకుండా అలానే ఉంచారని.. ఈ కారణంగానే పిఠాపురం.. సహా పలు గ్రామాలునీట మునిగాయని చెప్పారు.