జగన్ దెబ్బకు కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణమేనా ?

ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతంపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన దృష్టి కారణంగా కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణం మొదలైనట్లే ఉంది. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళ నుండి సుమారు 2.5 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. అలాగే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 70 వేల మంది విద్యార్ధులు ప్రైవేటు బాటను వీడి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. ఈ సంఖ్య ముందుముందు మరింతగా పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో పెరిగే విద్యార్ధుల సంఖ్య ఎంతగా పెరిగితే ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళ యాజమాన్యాలకు అంత నష్టం అన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేటు, కొర్పొరేటు స్కూళ్ళకు ధీటుగా బలోపేతం చేయాలన్న జగన్ నిర్ణయం అందరికీ తెలిసిందే. నాడు-నేడు అనే పథకం పెట్టి స్కూళ్ళలోని విద్యార్ధులకు అన్నీ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సుమారు 45 వేల విద్యాసంస్ధల్లో పనులకు ఏడాది క్రిందట మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రతి స్కూలులో మంచినీటి సౌకర్యం, బాత్ రూముల ఏర్పాటు, నీటి వసతి, ప్రతి స్కూలులోను ఫర్నీచర్, కాంపౌడ్ నిర్మాణం, ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్ ల్యాబులు, డిజిటల్ క్లాసుల ఏర్పాటుపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్న కారణంగా వేలాది స్కూళ్ళలకు ఒక్కసారిగా కొత్త కళ వచ్చేసింది. ప్రభుత్వ స్కూళ్ళంటే జనాల్లో ఉండే అభిప్రాయం ఒక్కసారిగా మారిపోతోంది. దానికితోడు స్కూళ్ళకు హాజరయ్యే విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కగా అమలు చేస్తోంది. అంతేకాకుండా ప్రతి విద్యార్ధికి పుస్తకాలు, బూట్సులు, యూనిఫారం జతలు కూడా ప్రభుత్వమే ఇస్తోంది.

ఇదే సమయంలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ప్రభుత్వస్కూళ్ళల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతుండటం కూడా విద్యార్ధుల ఆకర్షణకు మరో కారణంగా తెలుస్తోంది. నిజానికి ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లోనే క్వాలిఫైడ్ టీచర్లు చాలా ఎక్కువగా ఉంటారు. కాకపోతే సరైన ఆధరణ లేకపోవటంతో టీచర్లను, స్కూళ్ళను ఎవరు పట్టించుకోవటం లేదు. ఇపుడు ప్రభుత్వం స్కూళ్ళ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్లన్నీ కళకళలాడబోతున్నాయి.