గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్లు ఇప్పుడు నీట మునిగాయని.. వీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అప్పటి తప్పులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తాజాగా ఆయన సోమవారం కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో పర్యటించారు. ఏలేరు రిజర్వాయర్ పొంగడంతో గొల్లప్రోలు పరిధిలోని సుద్దగడ్డ వాగుకు వరద పెరిగి.. సమీపగ్రామాలు నీట మునిగాయి.
ఆయా గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. విపత్తు నిర్వహణ విభాగం అధికారుల సాయంతో ప్రత్యేక బోటులో అక్కడకు చేరుకున్నారు. అయితే.. బాధితుల గోడు వినేందుకు కొంత దూరం మోకాల్లోతు నీటిలో నే ముందుకు నడిచి.. వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న ఆహారం, తాగునీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయం చేస్తామని.. బాధితులను ఆదుకుంటామని చెప్పారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. జ్వరంతో బాదపడుతున్నానని పవన్ వెల్లడించారు.
జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసి తప్పులను సరిచేస్తామని పవన్ చెప్పారు. సుద్దగడ్డ వాగు పరిస్థితిని, ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. బాధితులకు ఏ అవసరం వచ్చినా.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తామని.. వాటికి నిధులు కూడా ఇస్తామని పవన్ చెప్పారు. వైసీపీ హయాంలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని.. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయన్నారు.
విజయవాడలో వరదలు అరికట్టేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పా రు. బుడమేరు వరద బాధితులను ఆయన ఆదుకున్నట్టు తెలిపారు. ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందని.. హైడ్రా వంటి బలమైన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని.. అయితే.. ఆక్రమణ దారుల్లో పేదలు ఉంటే వారిని ముందుగా ఆదుకుని.. ఆ తర్వాత చర్యలు చేపడతామని చెప్పారు. పవన్ కల్యాణ్ వెంట.. పలువురు అధికారులు ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates