పీసీసీ కొత్త చీఫ్.. రేవంత్ కు తిరుగులేదని ఫ్రూవ్ అయ్యింది

కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ అధిష్ఠానాన్ని.. ఆ పార్టీకి గాడ్ ఫాదర్ గా నిలిచే గాంధీ ఫ్యామిలీ ని అర్థం చేసుకోవటం.. వారి అభిమానాన్ని పొందటం.. వారి నమ్మకాన్ని సాధించటం అంత తేలికైన విషయాలు కావన్నట్లుగా చెబుతుంటారు. అయితే.. ఇలాంటి క్లిష్టమైన అంశాల్ని ఇట్టే అధిగమించిన రేవంత్ రెడ్డి.. తాజాగా మరోసారి తనకున్న పట్టును ప్రదర్శించారు. పైకి వినయంగా.. ఒద్దికగా కనిపించే రేవంత్.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే విషయంలో ఎంతకూ తగ్గరన్న విషయం మరోసారి ఫ్రూవ్ అయినట్లే.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం కోసం తపించి.. దాన్ని సాధించడం కోసం రేవంత్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్న రేవంత్..అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి కావటం తెలిసిందే.

కొద్ది రోజులుగా టీపీసీసీ చీఫ్ గానూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పోషిస్తూ.. జోడుగుర్రాల్ని అతి కష్టమ్మీద లాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడే వారి సంఖ్య భారీగా ఉంది. అంతమంది సీనియర్లను కాదనుకొని.. తాజాగా ఎంపిక చేసిన మహేశ్ కుమార్ గౌడ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టీపీసీసీ చీఫ్ రేసులో చాలానే మంది ఉన్నప్పటికీ.. తనకు అత్యంత విధేయుడైన మహేశ్ ను టీపీసీసీ పార్టీ రథసారధిగా నియమించారు. నిజానికి ఈ పోస్టు కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు సాగాయి.

అయినప్పటికీ రేవంత్ కోరుకున్న నేతకు.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే నాయకత్వాన్ని ఆయన కోరుకున్నారు. అనుకున్నట్లే తాను కోరుకున్నది జరిగేలా చేసిన ఆయన.. కాంగ్రెస్ అధినాయకత్వంలో తనకు తిరుగులేదన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.

ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా టీపీసీసీ చీఫ్ గా ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ రథసారధిగా తాను చేసిన పనుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన పదవీ కాలాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన పార్టీ నేతలకు.. పార్టీ సైనికులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. సోనియా గాంధీ పూర్తి విశ్వాసంతో తనను పీసీసీ చీఫ్ ను చేశారన్న సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రను తాను మరవలేనన్నారు.

తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభను గుర్తు చేసుకున్న ఆయన తుక్కుగూడ సభ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద ఎన్నికల సమావేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు. మొత్తంగా తన పదవీ కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే కాదు.. తిరిగి పూర్వ వైభవాన్ని రప్పించేలా రేవంత్ చేస్తున్న కృషిని కాంగ్రెస్ అధినాయకత్వం బాగా గుర్తించిందని చెప్పక తప్పదు.