విజయవాడ వరదకు కారణం తెలుసా

బుడమేరు. ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉంది.

సాధారణంగా బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం 11 వేల క్యూసెక్కులు. 2005 సంవత్సరంలో 70 వేల క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారి బెజవాడ నీట మునిగింది. అప్పట్లో చెలరేగిన ఆందోళనల మూలంగా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. ఖమ్మం నుండి వెలగలేరు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది.

2005లో బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకుంటే కృష్ణా జిల్లాకు శాశ్వత ముంపు పొంచి ఉంటుందని ఆందోళనలు జరిగాయి. దీంతో పొలవరం ప్రాజెక్టులో భాగంగా 2007 – 2008లో పోలవరం కుడికాల్వలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలంటే కృష్ణా ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులే ఈ జలాలు చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడికాల్వలో కలిపినా ఆ కాల్వ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు కావడం, బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయక పోవడం గమనార్హం.

2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్రా విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. దీంతో 20 నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది.