ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడి వారి హృదయాలను కూడా దోచుకున్నారు. అనేక విమర్శలు.. ఎత్తులు పైఎత్తులను కూడా తట్టుకుని ఇక్కడి ప్రజలు పవన్‌కు జై కొట్టారు. భారీ మెజారిటీతో విజయం అందించారు. దీనికి కృతజ్ఞతగా పవన్ కల్యాణ్.. పిఠాపురంలో అత్యాధుని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారాన్నిపురస్కరించుకుని ప్రత్యేక కానుకలు పంపించారు.
పిఠాపురంలో ప్రత్యేకంగా ఉన్న పురహూతికా అమ్మవారి ఆలయం గురించి.. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు తెలిసింది. వాస్తవానికి ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారికి పూజలు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా వచ్చి ఆ సమయంలోనే పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు పురహూతికా వృతాలు చేస్తారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. పూజల్లో పాల్గొనే మహిళల కోసం కానుకలు పంపించారు.
ఈ ప్రత్యేక పూజలకు 5 వేల మంది మహిళలు వస్తారన్న అంచనా ఉంది. అయితే.. పవన్ మాత్రం అదనంగానే 12 వేల పట్టు చీరలను(ఒక్కొక్కటీ రూ.2000లకు తగ్గదని పార్టీ నాయకులు చెబుతున్నారు)పిఠాపురానికి పంపించారు. దీనికి అదనంగా.. పసుపు, కుంకను కూడా జత చేశారు. అదేవిధంగా స్థానికంగా మహిళలు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆలయ కమిటీకి ఈ చీరలను అందించాలని.. తొక్కిసలాటలు జరగకుండా.. పక్కాగా కార్యక్రమం నిర్వహించేలా చూడాలని కూడా పవన్ ఆదేశించారు. దీంతో 12 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసేందుకు జనసేన నాయకులు పిఠాపురానికి క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో నాగబాబు పాల్గొనే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates