ఎన్ క‌న్వెన్ష‌న్ ఎఫెక్ట్‌: ఇండ‌స్ట్రీ బేజారు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై ఇప్ప‌టికే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఒకింత ఆగ్ర‌హంతో ఉంది. ఆయ‌న మాట‌ను కూడా ఎవ‌రూ పెద్ద‌ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని రేవంత్ కొన్ని రోజుల కింద‌ట చెప్పుకొచ్చారు. మా మాట విన‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి జోక్యం చేసుకుని.. సీఎం చెప్పింది.. నిర్మాత‌లు ఆలోచించాల‌ని సూచించారు. ఆ స‌మ‌యంలో కొంత వ‌ర‌కు సానుకూల ప‌వ‌నాలు వ‌చ్చాయి. మ‌రి రేవంత్ ఏం కోరుకున్నారో తెలియ‌దు కానీ.. నిర్మాత‌లు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు.

ఇక, ఇప్పుడు అనూహ్యంగా కాక‌పోయినా.. ముంద‌స్తుగానే నోటీసులు ఇచ్చి..అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేశారు. శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లైన కూల్చివేత‌లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కొన‌సాగాయి. ఈ ప‌రిణామం హైద‌రాబాద్ స‌హా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పైగా.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అయితే.. అంద‌రూ అవాక్క‌య్యారు. మ‌రికొంద‌రు హ‌ర్ట‌య్యారు. ఒక్క నాగార్జునే కాదు.. చాలా మంది నిర్మాత‌లు కూడా.. అనేక ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలే చేప‌ట్టారు.

ఇప్పుడు వాటికి కూడా నోటీసులు ఇవ్వ‌డం త‌ప్ప‌దు. ఒక‌రిది కూల్చి.. మ‌రొక‌రికి ఎక్సెప్ఫ‌న్ ఇవ్వ‌రు. దీంతో సినిమా ఇండ‌స్ట్రీ ఆందోళ‌న‌లో కూరుకుపోయింది. హైడ్రా కూల్చివేత‌లు వారి గుండెల్లో గుబులు రేపుతు న్నాయి. ప్ర‌భుత్వం మారినా.. కొంద‌రు సినీ ప్ర‌ముఖులు.. కేసీఆర్ కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌న్న కార‌ణంతో ఇలా చేస్తున్నార‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌గా మారింది. నిజానికి కేసీఆర్ స‌మ‌యంలోనూ ఇండ‌స్ట్రీ త‌ట‌స్థంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ, అప్ప‌ట్లోనూ ఉండ‌నివ్వ‌లేదు.

మా ద‌గ్గ‌ర ఉంటూ.. మాకు అనుకూలంగా లేక‌పోతే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న ధోర‌ణితోనే.. కేసీఆర్ స‌ర్కారు కూ డా న‌డుచుకుంద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వినిపించాయి. ఉద్య‌మ స‌మ‌యంలో అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు.. బిక్కుబిక్కు మంటూ కాలం గ‌డిపారు. ఇప్పుడు.. అంత ప‌రిస్థితి లేక‌పోయినా.. తెర‌చాటున మాత్రం ఏదో జ‌రుగుతోంద‌న్న‌ది చ‌ర్చ‌. అందుకే.. చిరంజీవి ఇటీవ‌ల నిర్మాత‌ల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. అయినా.. అవి స‌రిపోలేద‌న్న‌ట్టుగానే ప‌రిస్థితి మారింది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.